రాధేగా కంప్లీట్ యాక్షన్ మోడ్ లో సల్మాన్ ఖాన్…

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, ప్రభుదేవా దర్శకత్వంలో చేస్తున్న లేటెస్ట్ సినిమా దబాంగ్‌ 3. దబాంగ్ సిరీస్ లో భాగంగా రాబోతున్న ఈ మూడో సినిమాలో కూడా సోనాక్షి సిన్హానే హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని డిసెంబర్‌ 20న క్రిస్మస్‌ కానుకగా ఇది విడుదల చేయనున్నారు. నిజానికి సల్మాన్ సినిమా అంటే ఈద్ గుర్తొస్తుంది. గత కొన్నేళ్లుగా రంజాన్ కే సినిమాలు రిలీజ్ చేస్తూ సల్మాన్ హిట్స్ అందుకుంటున్నాడు అందుకే భాయ్ సినిమా లేని ఈద్ ని బాలీవుడ్ వర్గాలు ఊహించుకోలేవు. అయితే ఈసారి మాత్రం ట్రెండ్ మారుస్తూ భాయ్ క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు.

దబాంగ్ 3 రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ సల్మాన్ ఖాన్ ఒక మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. దబాంగ్3 అయ్యాక సల్మాన్ నటిస్తున్న సినిమా ఏది అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 తర్వాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఇన్షాల్లా సినిమా చేయాల్సి ఉంది కానీ కథ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇన్షాల్లా క్యాన్సిల్ అవుతుండడంతో సల్మాన్ చేయబోయే సినిమా ఏది అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. దీంతో సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూనే తాను నెక్స్ట్ చేయబోయే సినిమాని కూడా అనౌన్స్ చేసేసాడు. దబాంగ్ 3 సినిమాని తెరకెక్కిస్తున్న ప్రభుదేవా దర్శకత్వంలోనే నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్న సల్మాన్, దానికి రాధే అనే టైటిల్‌ ఫైనల్‌ చేశారు. రాధే మోషన్ పోస్టర్ లో సల్మాన్‌ యాక్షన్ మోడ్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఫ్లిక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఈద్‌కి విడుదల చేయనున్నారు.