కళలు, కళాకారుల కోసం ‘ఐరా’ డాన్స్ స్టూడియోస్ (డాన్స్ చేద్దాం రండి)

భోగిరెడ్డి శ్రవ్య మానస నాట్యంలో ఆరితేరింది. సాంప్రదాయ నాట్యానికి ఆధునికత జోడించి కూచిపూడిని కొత్త పుంతలు తొక్కించి డ్యాన్సర్ నుంచి డాన్స్ టీచర్ గా, డాన్స్ గురువుగా ఎదిగారు. తన శిష్య బృందం తో కలసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 1500 ప్రదర్శనలు ఇచ్చారు. మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తున్నారు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణా సహా 20 పైగా అవార్డులు సొంతం చేసుకున్నారు.

తండ్రి భోగిరెడ్డి శ్రీనివాస్ గాయకుడు, నటుడు అవడం మూలానా సంగీతం పట్ల, నృత్యం పట్ల ఉన్న ఆసక్తి తో 2005 సంవత్సరం లో ఏర్పాటు చేసిన సుమధుర ఆర్ట్స్ అకాడమీని శ్రవ్య మానస సాంప్రదాయ కూచిపూడి రూపాంతర నృత్యరీతులను సమ్మిళితం చేసి ప్రదర్శించే, శిక్షణ ఇచ్చే పెద్ద డాన్స్ ఇన్స్టిట్యూట్ గా 14 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ వస్తోంది. ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో ఇప్పుడు సుమారు 400 మంది విద్యార్థులు శ్రవ్య మానస వద్ద డాన్స్ శిక్షణ తీసుకుంటున్నారు. తనతో పాటు తన శిష్య బృందం లో 12 మంది ఇన్స్ట్రక్టర్ లను కూడా తయారు చేసుకున్నారు. హైదరాబాద్ లో ఈ డాన్స్ స్కూల్ మరో మూడు శాఖలను (మణికొండ, బాలానగర్, బంజారా హిల్స్) కూడా కలిగి ఉంది.

ఇప్పుడు తన డాన్స్ స్కూల్ ను స్పేస్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే నృత్యం, సంగీతం వంటి ‘ప్రదర్శించే’ కళలు, కళాకారులను ప్రోత్సహించడానికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ‘ఐరా’ డాన్స్ స్టూడియో గా ముందుకు తెచ్చారు శ్రవ్య మానస..

ఇందులో నాటక సమాజాలు, సాంస్కృతిక సంస్థల వారు రిహార్సల్స్ కోసం, వీడియో షూట్ లు, ఫోటో షూట్ లు, వర్క్ షాప్స్ లాంటివి కూడా నిర్వహించుకోవచ్చు. అలాగే, తమలో ఉన్న కళా ప్రతిభని పెంపొందించుకుని ప్రదర్శించడానికి తగిన వేదిక లేని పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కళాకారులు ఈ స్టూడియో ను సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 7-10 గంటల మధ్య నిబంధనలకు లోబడి ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తామని శ్రవ్య మానస భోగిరెడ్డి తెలియ చేసారు.

మోతినగర్ లోని జనప్రియ ఎదురుగా రెండు ఫ్లోర్స్ లో అన్ని ఆధునిక సాంకేతిక హంగులతో ఏర్పాటయిన ఈ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా 27వ తేదీన వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు సినీ సంగీత రంగాల నృత్య కళాకారులతో కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ కళాకారులు శ్రీయుతులు అప్పాజీ, ఉత్తేజ్, రాజీవ్, సంజీవ్, ప్రభావతి వర్మ, జయా నాయుడు, నృత్య దర్శకులు శ్రీధర్ రెడ్డి గారు, రచయిత సత్యదేవ్, నటరాజ్ భట్ మరియు వివిధ రంగాలకి చెందిన ప్రముఖులను ఈ వేడుకలకు ఆహ్వానించారు.

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ. మామిడి హరికృష్ణ గారు కూచిపూడి నృత్య గురువు డాక్టర్ సుధాకర్ గారు, శ్రవ్య మానస రీసెర్చ్ గురువు (పి హెచ్ డి గైడ్) ప్రొఫెసర్ ఎం ఎస్ శివరాజు గార్ల (హెచ్ సి యు) దీవెనలతో ఈ స్టూడియో ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ పట్నం లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐరా స్టూడియో శాఖ లోగో ను కూడా ఆవిష్కరించారు.