కష్టం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్…

కష్టం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్… మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ మూవీలో విజయ శాంతి చెప్పే డైలాగ్ ఇది. అనీల్ రావిపూడి రాసిన ఈ మాటలు స్టార్ ఖోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయి. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకి డాన్స్ కంపోజ్ చేస్తున్న శేఖర్ మాస్టర్, కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయి ఇబ్బంది పడుతున్న డ్యాన్సర్లకి అండగా నిలుస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ గ్రూప్ డాన్సర్ నుంచి ఈ స్థాయికి వచ్చిన వాడు కదా, షూటింగ్ లేక పోతే ఉండే కష్టం ఏంటో తనకి తెలుసు.

అందుకే డ్యాన్సర్ల కోసం ముందుకి వచ్చిన శేఖర్ మాస్టర్, “గత కొద్దిరోజులుగా డ్యాన్సర్లకు పని లేదు. అలాగే షో, ఆడియో ఫంక్షన్లు, సంగీత్‌ వంటి కార్యక్రమాలు ఆగిపోవడంతో గ్రూప్‌ డ్యాన్సర్లు సహా చాలామందికి ఆదాయం లేకుండా పోయింది. దీనివల్ల పూట గడవక చాలామంది బాధపడుతున్నారు. ఏ డ్యాన్సర్‌ అయినా సరే, మీకు నిత్యావసర సరుకులు అవసరమైతే కింది నంబర్‌కు ఫోన్‌ చేయండి. కాల్‌ చేసి సరుకులు తీసుకెళ్లండి. లాక్‌డౌన్‌ ఉంది కాబట్టి హైదరాబాద్‌లో ఉన్నవారికే సరుకులు ఇవ్వడం సాధ్యమవుతుంది. బయట పరిస్థితులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరూ బయట అడుగు పెట్టకండి” అని ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశాడు. శేఖర్ మాస్టర్ చేస్తున్న ఈ సాయంలో బాబా భాస్కర్, వినోద్ మాస్టర్లు కూడా అండగా నిలవడం గొప్ప విషయం.