ఫిబ్రవరిలో తన తనయుడు కేటీఆర్‌కు కేసీఆర్ సీఎం పదవికి అప్పగించడం ఖాయమని తెలుస్తోంది. కాబోయే కేటీఆర్ సీఎం అంటూ టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే వచ్చే నెలలో కేటీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఖయమని చెప్పవచ్చు. కొంతమంది నేతలైతే ఏకంగా కేటీఆర్‌కు ఫోన్ చేసి ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ సీఎం అయినా.. తెరవెనుక మొత్తం కేసీఆర్ నడిపిస్తారని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు కేటీఆర్‌కు కేసీఆర్ సీఎంగా బాధ్యతలు అప్పగించడం వెనుక ఒక కారణం వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు కేసీఆర్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సీఎంగా ఉంటే రాష్ట్ర వ్యవహారాలు చూసుకోవడానికే సమయం సరిపోతుంది. అందుకే కేటీఆర్‌కు రాష్ట్రాన్ని అప్పగించేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం కావాలంటే ఎంపీ కావాల్సి ఉంటుందని గతంలో కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. అందుకే కేటీఆర్‌కు సీఎంగా బాధ్యతలు అప్పగించిన తర్వాత టీఆర్‌ఎస్ ఎంపీల్లో ఎవరో ఒకరితో రాజీనామా చేయించి, ఆ తర్వాత జరిగే ఉపఎన్నికలో కేసీఆర్ పోటీ చేసే అవకాశముంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ నానా హడావిడి చేశారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు చెందిన నేతలను స్వయంగా కలిసి ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. అయితే ఈ సారి జమిలీ ఎన్నికలు రావడం ఖాయమనే వార్తలు వస్తుండటంతో.. జాతీయ రాజకీయాలపై ఇప్పటినుంచే కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఒక కొత్త జాతీయ పార్టీని కూడా కేసీఆర్ పెట్టనున్నారనే ప్రచారం కూడా గతంలో జరిగింది. ఇప్పుడు ఆ జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ కసరత్తులు చేయనున్నారని తెలుస్తోంది.
అంతేకాకుండా ఇటీవల తెలంగాణలో బీజేపీ బాగా బలపడుతోంది. బీజేపీని తెలంగాణలో దెబ్బతీయాలంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీఆయే ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాల్సి ఉంటుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనుండటం వెనుక ఇది కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మరి రానున్న కాలంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి కీలక పాత్ర పోషించబోతున్నారనేది వేచి చూడాలి.