‘రజాకార్’ మూవీ జెన్యూన్ రివ్యూ

భారతదేశానికి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నిజాం పాలనలోని ప్రజలకు మాత్రం స్వేచ్చ లభించలేదు. అప్పటి నిజాం పాలకుడు ఉస్మాన్ అలీఖాన్ ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి అంగీకరించ లేదు. అదే సమయంలో తన ప్రైవేట్ ఆర్మీ ‘రజాకార్‌’ చీఫ్‌ ఖాసీం రజ్వీ మాటలు నమ్మి ఉస్మాన్ అలీఖాన్ ఈ ప్రాంతాన్ని తుర్కిస్థాన్‌ చేయాలనుకున్నాడు. నిజాం నియంత్రృత్వ పోకడలను, రజాకార్‌ సైన్యం ఆగడాలు, అరాచకాలను ప్రజలు ఎలా ఎదుర్కొన్నారు? అందుకు కేంద్రంలోని ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ ఎలా సహకరించారు? నిజాం స్టేట్‌ కు 1948 సెప్టెంబర్‌ 18న ఎలా విమోచన లభించింది? అనేదే ‘రజాకార్‌’ మూవీ. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడురు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అనేక అడ్డంకులను అధిగమించి శుక్రవారం జనం ముందుకు వచ్చింది.

మధ్య భారత ప్రాంతాన్ని దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు. పర్షియా నుండి భారత్ వచ్చిన నిజాం వంశస్థులు ఔరంగజేబ్ మరణానంతరం ఈ ప్రాంతాన్ని స్వతంత్రంగా పరిపాలించడం మొదలెట్టారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒప్పందం చేసుకుని తమ పరిపాలనను కొనసాగించారు. అలాంటి నిజాం పాలకులలో ఆఖరివాడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్. 1911 నుండి 1948 వరకూ అతను నైజాం ప్రాంతాన్ని పాలించాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తన సంస్థానాన్ని విలీనం చేయకుండా ఉండటం కోసం ఇక్కడి హిందువులను మతం మార్చాడు. బడుగు బలహీన వర్గాల వారిని దారుణంగా హతమార్చాడు. మహిళలపైకి రజాకార్లను ఉసిగొల్పి వారి మాన ప్రాణాలను దోచుకున్నాడు. అలాంటి నిజాం ఆగడాలకు తెరరూపం ఈ ‘రజాకార్‌’ చిత్రం.

తెలంగాణ ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా వేలాది మంది నాయకులు ఉద్యమం చేశారు. లక్షలాది మంది సాధారణ ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేశారు. వారందరి జీవితాలను ఈ సినిమాలో సంక్షిప్తంగా చూపించడం జరిగింది. నిజాం పరిపాలనలోని ఇతర అంశాల జోలికి పోకుండా అతని అండతో ఖాసీం రజ్వీ ఎలాంటి దారుణాలకు ఒడిగట్టాడు? ఆ ఫలితాన్ని ఎలా అనుభవించాడు? గుంటనక్క లాంటి రజ్వీ మాటలను నమ్మి నిజాం ఎలా మోసపోయాడు? అనే దానికి ‘రజాకార్‌’ను పరిమితం చేశారు.

ఇప్పటి తెలంగాణతో పాటు అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు నిజాం ఏలుబడిలో ఉండేవి. నిజాం నవాబు ఘోర కృత్యాలకు బలైన వారిలో వారూ ఉన్నారు. అందుకే మరాఠీలో తొమ్మిదేళ్ళ క్రితమే ‘రజాకార్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. అది తెలుగులోనూ అనువాదమై విడుదలైంది. కానీ దానికి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. అయితే… ఇలాంటి చారిత్రక చిత్రాలలో గుర్తింపు, అనుభవం ఉన్న నటీనటులు కీలక పాత్రలను పోషిస్తేనే అవి ప్రేక్షకాదరణ పొందుతాయని, ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తాయని ‘రజాకార్‌’ దర్శక నిర్మాతలు భావించారు. దానికి తగ్గట్టుగానే నటీనటులను ఎంపిక చేశారు. ఉస్మాన్ అలీఖాన్, కాసీం రజ్వీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, కె.ఎం. మున్షీ వంటి పాత్రల కోసం వారిని పోలిన నటులను తీసుకొచ్చారు. ఇతర కీలక పాత్రలను ప్రేమ, ఇంద్రజ, అనసూయ, వేదిక, బాబీ సింహా, జాన్ విజయ్ తదితరులతో చేయించారు. దర్శకుడు యాటా సత్యనారాయణకు తెలుగు సినిమా, టీవీ రంగంలో విశేష అనుభవం ఉన్న కారణంగా అనేకమంది నటీనటులు ఈ సినిమాలో చిన్న పాత్రలను సైతం పోషించారు.

నిజాం నియంతృత్వ పాలన గురించి, రజాకార్‌ దుశ్చర్యల గురించి అవగాహన లేని ఈ తరం వారికి ఈ సినిమాలోని కొన్ని సంఘటనలు మింగుడు పడటం కష్టం. ఇలాంటి దారుణాలను తెలంగాణ ప్రజలు ఎలా సహించారు? ఎలా తట్టుకున్నారనే సందేహం రావడం కూడా సహజం. వివిధ పార్టీలు, హిందూ సంస్థలు చేసిన సమష్టి పోరాటం కారణంగానే నిజాం దిగి వచ్చాడు. అలానే భారత యూనియన్ నుండి నిజాం కోరలు పీకడానికి పటేల్ సంసిద్థం కావడంతో తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగింది. చిత్రం ఏమంటే… ఈ దారుణ మారణకాండను సైతం కొందరు రాజకీయ లబ్దికోసం ఉపయోగించుకుంటున్నారు. అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఒకలా, అధికార పీఠం ఎక్కిన తర్వాత మరోలా మాటలను మార్చేస్తున్నారు. నిజాం వారసుల మెప్పుకోసం చారిత్రక అంశాలను ప్రజలకు తెలియ చెప్పడంలో వెనుకంజ వేస్తున్నారు. పాత గాయలను రేపడం సరికాదంటూ సుద్దులు చెబుతున్నారు. నిజానికి చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలం. పాత తప్పులను చేయకుండా జాగ్రత్త పడగలం. కాబట్టి మనసుకు కష్టం కలిగినా కొన్ని ఘోర వాస్తవాలను ఈ తరానికీ తెలియ చెప్పాల్సిందే. ఆ విషయంలో ఈ చిత్ర నిర్మాతలు చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి.

అయితే తెలంగాణ విముక్తిలో కమ్యూనిస్టులు చేసిన పోరాటం సైతం కీలకమైంది. వారి ఆశలు, ఆకాంక్షలు వేరే ఉన్నా… ప్రజలను చైతన్యవంతులు చేయడానికి, సాయుధులుగా మార్చడానికి కృషి చేశారు. కంటి తుడుపు చర్యగా… రోలింగ్ టైటిల్స్ సమయంలో కమ్యూనిస్టు యోధులందరినీ స్మరించుకున్నారు. నిజాం వ్యతిరేక పోరాటాన్ని రెండున్నర గంటల సినిమాలో చూపించడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందువల్లే కొన్ని కీలక ఘట్టాలను మాత్రమే ఇందులో చూపించారు. ఇలాంటి చారిత్రక సినిమాలలో కథలను నడిపే ప్రధాన పాత్ర ఒకటి ఉండాలి. దాని ద్వారా అప్పటి సంఘటనలను వివరించాలి. అలా చేసి ఉంటే ఇందులోని ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులు మరింతగా కనెక్ట్ అయ్యే వారు.

ఏదేమైనా ‘రజాకార్‌’ మూవీని చారిత్రక వాస్తవాలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నటీనటుల నుండి అద్భుతమైన నటనను రాబట్టుకున్నారు. సాంకేతిక నిపుణుల ప్రతిభకు పట్టంకట్టారు. ముఖ్యంగా ఆర్ట్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ గొప్పగా ఉన్నాయి. ఈ సంఘటనల సమాహారాన్ని కలుపుతూ ఏకసూత్రంగా ఉండే పాత్రనొక దానిని క్రియేట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.