వెంకటేశ్ రెండో కూతురు పెళ్ళి – పెళ్లి కొడుకు ఎవరో తెలుసా!

రీల్ లైఫ్ లో అనేక ఫ్యామిలీ డ్రామాస్ లో తనకు తానే సాటి అన్న తీరున నటించారు విక్టరీ వెంకటేశ్ అదే విధంగా రియల్ లైఫ్ లోనూ ‘ఐ యామ్ ఏ ఫ్యామిలీ మేన్’ అంటూ చాటుకుంటూ ఉంటారు. తన కుటుంబానికి వెంకటేశ్ ఎంతో ప్రాధాన్యమిస్తారు. తాను బిజీగా సాగుతున్న రోజుల్లోనూ వెంకటేశ్ ఫ్యామిలీ మెంబర్స్ తో గడపడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించుకొనేవారు. అలాగే ఆయన తన భార్యాబిడ్డలకు ఎంతో ప్రీతిపాత్రుడయ్యారు. అందువల్ల వెంకటేశ్ ఇంట ఓ కార్యక్రమం జరుగుతోందంటే – అది ఓ స్పెషాలిటీని సంతరించుకుంటుంది. మార్చి 15న వెంకటేశ్ రెండో కూతురు హయవాహిని వివాహ మహోత్సవం కళ్యాణవైభోగమే అన్న రీతిన జరిగింది.
ఇంతకూ వరుడు ఎవరు? అదే కదా ఎవరికైనా వెంటనే తట్టే ప్రశ్న! అబ్బాయి పేరు నిశాంత్. హైదరాబాద్ లోనే డాక్టర్ గా పనిచేస్తాడు. విజయవాడ వాస్తవ్యులు. అబ్బాయి వైపు వారు కూడా బాగా కలిగినవారు, పైగా విద్యావంతుల కుటుంబం అని తెలుస్తోంది.

చిత్రసీమలో తన మిత్రులు, సన్నిహితులైన వారికి శుక్రవారం రాత్రి రామానాయుడు స్టూడియోస్ లో భారీ విందు ఏర్పాటు చేశారు వెంకటేశ్. నార్సింగ్ లోని ఓ కన్వెన్షన్ హాల్ లో హయవాహిని, డాక్టర్ నిశాంత్ వివాహం జరిగింది. ఈ వేడుకలో వెంకటేశ్ కుటుంబ సభ్యులందరూ పాలుపంచుకోవడం విశేషం! గత కొద్ది రోజులుగా వెంకటేశ్ తన నటనకు దూరంగా జరిగి, కూతురు వివాహానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. పెళ్ళి, తరువాతి కార్యక్రమాలు పూర్తి కాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కుటుంబ కథా చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా రానుందని సమాచారం. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ‘రానా నాయుడు- 2’ సిరీస్ లోనూ నటించడానికి అంగీకరించారు. తన ‘ప్రేమించుకుందాం… రా’ చిత్రంలో ‘పెళ్ళి కళ వచ్చేసిందే బాలా…’ అంటూ సందడి చేసిన వెంకటేశ్ ఇంట ఇప్పుడు నిజంగానే ‘కళ్యాణ కళ’ తొణికిసలాడింది. రెండోసారి మామ అయిన వెంకటేశ్ ముఖంలో మరింత కళ కనిపించిందని అంటున్నారు.