శుక్రవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్ తో పీఆర్వో, నిర్మాత బీఏ రాజు గుండెపోటుతో మరణించారు. బీఏ రాజు మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఇండస్ట్రీకి తలలో నాలుక లాంటి వ్యక్తి బీఏ రాజు లేరని వార్త తెలిసి షాక్కు గురయ్యాను అని అన్నారు చిరు.
“బీఏ రాజు పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. మద్రాసులో ఉన్నప్పుడు సినీపరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో షేర్ చేసుకునేవారు. ప్రతి కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునేవాడిని.. ఆన్ లొకేషన్ షూటింగ్ స్పాట్ లో వచ్చి నాతో చాలా సరదాగా ముచ్చటించేవారు. చాలా విషయాల్ని మాట్లాడుకునేవాళ్లం. నా చాలా సినిమాలకు ఆయన పీఆర్ వోగా పని చేశారు. సినిమా సమస్త సమాచారం.. ఎన్నో సంవత్సరాల క్రితం రిలీజైన క్లాసిక్స్ కి సంబంధించిన కలెక్షన్స్ ట్రేడ్ రిపోర్ట్ రికార్డుల గురించి యథాతథంగా చెప్పగల గొప్ప నాలెజ్ బ్యాంక్ ఆయన. ఏ సినిమా ఏ తేదీన రిలీజైంది? ఆ సినిమా ఎంత వసూలు చేసింది? అన్న లెక్కల్ని కచ్ఛితంగా చెప్పేవారు. ఏ సెంటర్ లో ఎంత వసూలు చేసింది? ఎన్నిరోజులు ఆడింది.. చెప్పేవారు. 100 రోజులు 175 రోజులు 200 రోజులు అంటూ ప్రతిదీ పరిశ్రమకు ఎన్ సైక్లోపెడియాలా సమాచారం అందించిన పత్రికా జర్నలిస్ట్.. మేధావి.. సూపర్ హిట్ సినీమ్యాగజైన్ కర్త ఆయన. చాలా సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన బీఏ రాజుగారు ఉండడం పరిశ్రమ అదృష్టం. అలాంటి వ్యక్తి నేడు లేరని తెలిసి షాక్కు గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని చిరంజీవి తెలిపారు.