పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్

ఈ ఏడాది టాలీవుడ్‌లో చాలామంది పెళ్లిళ్లు జరుగుతున్నాయి. సినిమాలతో బిజీగా ఉండే హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల సమయం దొరకడంతో పలువురు సెలబ్రెటీలు పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో హీరో రానా, నితిన్, నిఖిల్ పెళ్లి చేసుకోగా.. హీరోయిన్లలో కాజల్ అగర్వాల్, నిహారిక పెళ్లి చేసుకున్నారు. ఇక నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఒక ఇంటివాడు అయ్యాడు. తాజాగా శ్రీజ గౌని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

VIVEK ATREYA

కరోనా నిబంధనల క్రమంలో కొంతమంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. సినిమా ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ నివేదా థామస్, యంగ్ హీరో శ్రీ విష్ణు, పలువురు అసిస్టెంట్ డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

‘బ్రోచెవారెవరురా’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వివేక్ ఆత్రేయ. ఆ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవడంతో… సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నాని హీరోగా రానున్న ‘అంటే.. సుందరానికీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.