కేజీఎఫ్ అభిమానులకు గుడ్‌న్యూస్

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘కేజీఎఫ్ 2’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా హాట్‌టాపిక్‌గా మారుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కేజీఎఫ్ మూవీ అన్ని భాషల్లో సూపర్ హిట్ కావడంతో.. ఛాప్టర్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

KGF2

తాజాగా ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశాడు. డిసెంబర్ 21న ఉదయం 10:08 గంటలకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలిపాడు. దీంతో ఈ సర్‌ప్రైజ్ ఏమో ఉంటుందనేది చర్చనీయాశమైంది. టీజర్ రిలీజ్ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో దీని షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం ఇటీవలే యశ్ హైదరాబాద్ వచ్చాడు.

ఇక బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతం యశ్, సంజయ్ దత్ మధ్య యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు రవి శంకర్ డబ్బింగ్ చెప్పనున్నట్లు సమాచారం. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.