ప్రత్యేక రాష్ట్రం కోసం 1953లో మొదలైన తెలంగాణ ఉద్యమం… 2011 సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ తో తీవ్ర రూపం దాల్చింది. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ ఒకేతాటి పైకి వచ్చి రాష్ట్రం కోసం పోరాడారు. వీరి దశాబ్దాల పాటు సాగిన ఈ పోరాటం, శ్రీకాంత్ ఆచారి లాంటి ఎందరో విద్యార్థుల బలిదానం, కెసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అన్నీ కలిసి ఈ పోరాట స్థాయిని మరింత పెంచాయి. ఈ పోరాటానికి ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రతి చిన్న దానికి గొడవలు, ధర్నాలు చేస్తున్న కాలంలో అత్యంత శాంతియుతంగా సాగిన ఒక ప్రత్యేక పోరాటంగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది. సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పోరాటంతో సాధించుకున్న ఈ బంగారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. ఒక లక్ష్యం కోసం ఎలా పోరాడాలి? ఎంత పట్టుదలతో ఉండాలి? ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ఎలా ముందడుగు వేయాలి అనే విషయాల్లో భవిష్యతరాలకి కూడా కెసీఆర్ ఆదర్శంగా ఉంటారు. అందుకే తెలంగాణ రాష్ట్ర పితామహుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటున్నాడు.
ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాళ్లు అర్పించారు. సీఎంతో కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఎంపీ సంతోష్ కుమార్ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాజీ స్పీకర్ మధుసూదనచారి మేయర్ విజయలక్ష్మి అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత గన్ పార్క్ నుంచి సీఎం కేసీఆర్ నేరుగా ప్రగతి భవన్ చేరుకొని రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగుర వేసి వందనం చేశారు. కరోనా వైరస్ విజృంభణ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది లాగే ఈ సంవత్సరం కూడా రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా జరగట్లేదు.