మహాసముద్రంలోకి దిగడానికి రెడీ అయిన సిద్దార్థ్

సిద్దార్థ్… ప్రేమ కథలకి కేరాఫ్ అడ్రెస్. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఓ మై ఫ్రెండ్, ఓయ్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమ కథా చిత్రం అంటే చాలు అందులో సిద్దార్థ్ ఉండాల్సిందే అని తెలుగు ఆడియన్స్ ఫిక్స్ అయ్యే రేంజులో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న హీరో. ఒకానొక టైములో సిద్దార్థ్ సినిమాలు చూసి ఇలాంటి అబ్బాయే బాయ్ ఫ్రెండ్ గా కావాలి అనుకున్న అమ్మాయిలెందరో. గయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ తో, మెస్మరైజింగ్ యాక్టింగ్ తో అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న ఈ హీరో, ఆ తర్వాత కోలీవుడ్ కే పరిమితమయ్యాడు. అప్పుడప్పుడూ డబ్బింగ్ సినిమాలతో పలకరించినా, అభిమానులని అవి అనుకున్నంతగా తృప్తి పరచలేకపోయాయి. సరైన కథ పడితే ఎప్పుడైనా తెలుగులో సినిమా చేయడానికి సిద్ధమని చెప్పిన సిద్దార్థ్, చాలా రోజుల తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.

ఈ లవర్ బాయ్ ని వెనక్కి తెస్తున్నట్లు అనిల్ సుంకర అనౌన్స్ చేశాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో RX 100 ఫేమ్ అజయ్ భూపతి మహాసముద్రం సినిమా చేస్తున్నాడు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సిద్దార్థ్ స్పెషల్ రోల్ చేయడానికి సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ డైరెక్టర్ అజయ్ భూపతి, ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్వీట్స్ చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ సిద్దార్థ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ, అతను నటించిన సినిమాలని కలిపి ఒక వీడియో రిలీజ్ చేశారు. #SidIsBack ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న మహాసముద్రం సినిమా గురించి ప్రతి వారం ఒక కొత్త విషయాన్ని అనౌన్స్ చేస్తామని మేకర్స్ పోస్ట్ చేసారు.