ఆర్.నారాయణమూర్తి, ప్రజా సమస్యలపై సినిమాలు చేస్తూ… సమాజాన్ని ప్రతిభింబించే చిత్రాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కోట్లు వచ్చే కమర్షియల్ సినిమాలని వదిలేసి నమ్మిన సిద్దంతాన్నే కథాంశంగా చేసుకోని అర్ధ రాత్రి స్వాతంత్రం, ఒరేయ్ రిక్ష, లాల్ సలాం, ఎర్ర సైన్యం, చీమలదండు, ఎర్రోడు, ఛలో అసెంబ్లీ లాంటి ఎన్నో హిట్ సినిమాలని ఇచ్చాడు. ఎంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నా సాధారణ జీవితం గడపడం ఆర్.నారాయణమూర్తి ప్రత్యేకత.
రైతు ఉద్యమానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో జరిగిన ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్.నారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలని విమర్శించారు. ఒకే దేశం, ఒకే మార్కెట్ విధానాన్ని బీహార్ రాష్ట్రంలో 2006లోనే ప్రవేశపెట్టారని, దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పుడు రైతులు లేరని, కేవలం రైతుకూలీలే ఉన్నారని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి వాటిని ప్రైవేటీకరణ చేయడం అన్యాయమన్నారు.