భారీ రికార్డు సాధించిన ‘వకీల్ సాబ్’

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. బోనీ కపూర్‌తో కలిసి ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు దీనిని నిర్మిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇందులో నివేదా థామస్, అంజలి, శృతిహాసన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాకు రీమేక్ ఇది. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించగా.. అనిరుద్ధా రాయ్ చౌదరి దర్శకత్వం వహించాడు.

PAWAN KALYAN

తెలుగులో ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రాజకీయాల్లోకి వెళ్లిన పవన్.. చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ‘వకీల్ సాబ్’ సినిమా కోసం పవన్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్‌ను ఫాలో అవుతున్నారు.

ఈ క్రమంలో విడుదలకు ముందే వకీల్ సాబ్ రికార్డు సృష్టించింది. 2020లో అత్యధికంగా ట్వీట్ చేసిన తెలుగు సినిమాగా నిలిచింది. సౌత్ ఇండియాలో ఎక్కువమంది ట్వీట్ చేసిన సినిమా వివరాలను తాజాగా ట్విట్టర్ వెల్లడించింది. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా అగ్రస్థానంలో ఉంది. ఇక సౌత్ ఇండియా పరంగా రెండో స్థానంలో ‘వకీల్ సాబ్’ ఉండగా.. మూడో స్థానంలో ‘వలిమాయి’ ఉంది. ‘సర్కారువారి పాట’ నాలుగో స్థానంలో, RRR 6వ స్థానంలో ఉంది.

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 9వ స్థానంలో ఉండగా.. మహేష్‌కి చెందిన రెండు సినిమాలు టాప్ 10లో ఉండటం విశేషం. తెలుగులో ‘వకీల్ సాబ్’ అగ్రస్థానంలో ఉండటంపై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పందించింది. ఈ ఘనత సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది. అటు పవన్ కల్యాణ్ అభిమానులు ఈ రికార్డు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది