కథ నచ్చితేనే.. లేకపోతే అంతే సంగతులు

ఒకప్పుడు డైరెక్టర్ల మీద నమ్మకంతో హీరోలు సినిమాలు చేసేవాళ్లు. అసలు కథ కూడా వినకుండా దర్శకుడిపై నమ్మకంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మరికొంతమంది హీరోలు అయితే కథ కూడా సరిగ్గా వినరు. మంచి డైరెక్టర్ అయితే వెంటనే సినిమా ఒప్పేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కథ నచ్చితేనే సినిమాలు చేస్తామని చెబుతున్నారు హీరోలు.

ఇటీవల హీరోల ధోరణి పూర్తిగా మారిపోయింది. కథ నచ్చకపోతే మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నారు. కథలు ఏమైనా మార్పులు చేయాల్సి వచ్చినా ఓపెన్‌గా డైరెక్టర్లకు చెబుతున్నారు. దీంతో డైరెక్టర్లు హీరోలను ఒప్పించడానికి చాలా కష్ట పడాల్సి వస్తోంది.

ఇటీవల ‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌ను వి.వి. వినాయక్ తెరకెక్కించాలని అనుకున్నాడు. కానీ కథలో ఆయన చేసిన మార్పులు చిరుకు నచ్చలేదట. దీంతో ఆ సినిమా నుంచి వినాయక్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రంగస్థలం సినిమా తర్వాత మహేష్ బాబుకు సుకుమార్ ఒక కథ చెప్పాడట. మహేష్‌కు ఆ కథ నచ్చకపోవడంతో సుకుమార్‌కి నో చెప్పాడట.

అలాగే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్, రాంచరణ్, ప్రభాస్‌కి కథ చెప్పాడట. అయితే అతడి చెప్పిన కథ ఎవరికీ నచ్చలేదట. దీంతో గతంలో లాగా హీరోలు లేరని, కథ నచ్చితేనే సినిమాలు చేస్తున్నారని డైరెక్టర్లు చెబుతున్నారు.