తెలంగాణ రాష్ట్రంలోని ‘సంగారెడ్డి జిల్లా పరిషత్’ను భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. సంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సాధించిన ప్రగతికి గానూ.. పంచాయితీ రాజ్ డిపార్ట్మెంట్లోనే అత్యున్నత పురస్కారమైన ‘దీన్ దయల్ ఉపాధ్యాయ్ సశక్తికరణ్ పురస్కార్’తో ‘సంగారెడ్డి జిల్లా పరిషత్’ను భారత ప్రభుత్వం గౌరవించింది. జిల్లా పరిషత్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకున్న భారత ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా పరిషత్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సంగారెడ్డి జిల్లా పరిషత్‌కు ‘దీన్ దయల్ ఉపాధ్యాయ్ సశక్తికరణ్ పురస్కార్’ అవార్డు రావడానికి కారణమైన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు పలువురు ప్రముఖుల మధ్య ప్రగతిభవన్‌లో సన్మానించారు. ‘‘మనం కాదు మాట్లాడాల్సింది.. మనం చేసే పని మాట్లాడాలి’’ అంటూ తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పరిషత్‌కు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పథకాలన్నింటిని సక్రమంగా అమలు పరిచి, అభివృద్ధికి కారణమైన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డిగారిని అభినందిస్తున్నానని, ముందు ముందు మరెన్నో అవార్డులు ఈ సంగారెడ్డి జిల్లా పరిషత్ అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, పంచాయతీ రాజ్ మినిస్టర్ ఎర్రవల్లి దయాకర్, పంచాయతీ రాజ్ కమిషనర్ స్మితా సబర్వాల్, జిల్లా పరిషత్ సి.ఏ.ఓ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, ‘దీన్ దయల్ ఉపాధ్యాయ్ సశక్తికిరణ్ పురస్కార్’ను ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్రమోడీగారు లేదంటే వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడుగారి చేతుల మీదుగా సంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డిగారు అందుకోనున్నారు.