ఎన్టీఆర్ ఫిల్మ్స్ పతాకంపై పి.వి.నరసింహరావు బయోపిక్

బహుభాషా కోవిదుడు-అసాధారణ ప్రజ్ఞా దురీణుడు-స్వర్గీయ భారత ప్రధానమంత్రి పి.వి.నరసింహరావు బయోపిక్ ‘ఎన్టీఆర్ ఫిల్మ్స్” పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ లో రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఈయన ఇంతకుముందు శ్రీహరితో “శ్రీశైలం” చిత్రాన్ని నిర్మించారు.

పలు సూపర్ హిట్ చిత్రాల రూపకర్త-ప్రముఖ సీనియర్ దర్శకుడు ‘ధవళ సత్యం’ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
“ఎన్టీఆర్ ఫిల్మ్స్” పతాకంపై తెలుగు-హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో తెరకెక్కే ఈ బయోపిక్ లో… జాతీయస్థాయిలో సుపరిచితుడైన ఓ ప్రముఖ నటుడు పి.వి.నరసింహరావు పాత్రను పోషించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని… ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటూ అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2022, జూన్ 28న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.