“సినిమా దర్శకులకు దర్శకరత్న దాసరి నారాయణరావుగారు ఎలాగో, ఫిల్మ్ జర్నలిస్టులకు బీఏ రాజు అలాగ. ఇద్దరూ మార్గదర్శకులుగా నిలిచిన వ్యక్తులు. పెద్దదిక్కుగా నిలిచినవాళ్లు” అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అన్నారు. ప్రముఖ నిర్మాత, సూపర్‌హిట్ పత్రికాధినేత, పీఆర్వో, జర్నలిస్ట్ బీఏ రాజు ఆకస్మిక మృతిపై ప్రవీణ్ సత్తారు సంతాపం వ్యక్తం చేశారు.
బీఏ రాజుతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రవీణ్ సత్తారు గుర్తు చేసుకుంటూ “బీఏ రాజుగారు ఓ ఫిల్మ్ డిక్షనరీ. చిత్ర పరిశ్రమకు ఎన్నో ఏళ్లుగా సేవలు అందించారు. ఆయనతో నేను మాట్లాడింది తక్కువే. కానీ, మాట్లాడిన ప్రతిసారీ ఓ మంచి అనుభూతి. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. చాలా పాజిటివ్ పర్సన్. మారుతున్న కాలానికి అనుగుణంగా తనకు తాను అప్డేట్ అవుతూ వచ్చారు. ప్రస్తుతం నాగార్జునగారు కథానాయకుడిగా నేను దర్శకత్వం వహిస్తున్న సినిమాకు ఆయన పీఆర్వో. పీఆర్వోను మించిన వ్యక్తి బీఏ రాజుగారు. సినిమాకు ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. ఎన్నో ఏళ్ల క్రితం విడుదలైన సినిమాల గురించి అవలీలగా చెప్పగలరు. తెలుగు సినిమా హైదరాబాద్ సిటీకి వచ్చినప్పటి నుంచి, అంతకు ముందు మద్రాసులో ఉన్నప్పుడు ఆయన సేవలు అందించారు. మనం నడిచే ఓ సినిమా లైబ్రరీ, డిక్షనరీని కోల్పోయాం. బీఏ రాజు మరణం సినీ జర్నలిజానికి, చిత్ర పరిశ్రమకు లోటు” అని చెప్పారు.