సీఎంను కలిసిన హీరో విజయ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇవాళ తమిళనాడు సీఎం పళనిస్వామిని కలవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ‘మాస్టర్’ సినిమాను విడుదల చేయనున్న క్రమంలో సీఎంను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయ్‌తో పాటు ‘మాస్టర్’ నిర్మాత లలిత్ కుమార్, మంత్రి ఎస్పీ వేలుమణి కూడా సీఎంను కలిశారు. సంక్రాంతికి ‘మాస్టర్’ సినిమాను విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్లలో 100 శాతం సీటింగ్ ఆక్యూపెన్సీకి అనుమతి ఇవ్వాలని సీఎంను విజయ్ కోరినట్లు తెలుస్తోంది.

VIJAY MEET CM

అలాగే ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని హీరో విజయ్ కోరినట్లు సమాచారం. ఇటీవల తమిళనాడు సమాచార, ప్రచార శాఖ మంత్రి కదంబర్ రాజును మాస్టర్’ సినిమా యూనిట్ కలిసింది. 100% సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లను నడుపుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని కోరింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

దీంతో హీరో విజయ్ డైరెక్టుగా సీఎం పళనిస్వామిని కలిసి దీని గురించి చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. ఇప్పటికే విడుదలైన మాస్టర్ సినిమా టీజర్ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించంది. సౌతిండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా నిలిచింది.