నందమూరి- నారావారి అనుబంధంతో ‘అన్ స్టాపబుల్-2’!

“సదా నన్ను కోరుకొనే మీ అభిమానం… ‘అన్ స్టాపబుల్’ను టాక్ షోలకి అమ్మమొగుడిగా చేసింది…” అంటూ నటసింహ నందమూరి బాలకృష్ణ విజయగర్జన చేశారు. ఈ ముచ్చట ‘అన్ స్టాపబుల్’ రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ ప్రోమోలో చోటు చేసుకుంది.

ఈ ప్రోమో మంగళవారం సాయంత్రం జనం ముందుకు వచ్చింది. దాదాపు ఐదు నిమిషాలు సాగిన ఈ ప్రోమోలో బాలకృష్ణ ఆరంభంలోనే బైక్ పై విచ్చేయడం, ఎంతో హుషారుగా కేకలు వేస్తూ అక్కడ పాల్గొన్న అభిమానుల్లో ఉత్సాహం నింపడం కనిపించింది. ఇందులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిథిగా పాల్గొనడం విశేషం! “ఈ సారి మా బంధువును ముందుగా పిలుద్దామనుకున్నా… కానీ, ప్రజలందరి బంధువును పిలిస్తే బాగుంటుందనుకున్నా… అందుకే మీకు బాబుగారూ… నాకు బావగారూ…” అంటూ చంద్రబాబు నాయుడుకు బాలయ్య స్వాగతం పలకడం అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది.

“నాకు రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి…” అంటూ బాలయ్య చెప్పడం, “అయితే వసుంధరకు కూడా చెబుదాం… బ్రేకింగ్ న్యూస్ ఇది…” అంటూ చంద్రబాబు మాట కలపడం మురిపించింది. “మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి…” అన్నది బాలయ్య ప్రశ్న, దానికి చంద్రబాబు “మీ కంటే ఎక్కువ చేశా…” అంటూ జవాబివ్వడం అలరించింది. “మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?” అన్న ప్రశ్నకు చంద్రబాబు “రాజశేఖర్ రెడ్డి…” అని చెప్పడమూ ఆకట్టుకుంది. 1995లో అందరూ కలసి తీసుకున్న ‘బిగ్ డెసిషన్’ గురించి కూడా చర్చకు వచ్చింది. ఈ షో మధ్యలో చంద్రబాబు తనయుడు, బాలయ్య పెద్దల్లుడు లోకేశ్ కూడా పాల్గొనడం మరింతగా ఆకట్టుకుంది. లోకేశ్ ను మంగళగిరి ఎన్నికల ఫలితం గురించి అడగడమూ ఆసక్తి కలిగించింది. తరువాత బాలయ్య సీట్ లోకి లోకేశ్ మారి ప్రశ్నలు కురిపించడమూ మురిపించింది. ఇందులో కేవలం రాజకీయాలే కాకుండా, నందమూరి- నారావారి కుటుంబాల అనుబంధాన్నీ ముచ్చటించుకోవడం అభిమానులను తప్పకుండా అలరిస్తుంది. ఇలా పలు విశేషాలతో ముస్తాబయిన ఈ ప్రోమోనే అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంటే, మరి ఎపిసోడ్ ను మొత్తం చూసేయాలన్న తలంపు కలగకుండా ఉంటుందా? ఈ నెల 14 నుండి ప్రతి శుక్రవారం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై దర్శనమిచ్చే ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ ఏ తీరున అలరిస్తుందో చూద్దాం.