పదేళ్లకు జనరేషన్ మారుతుంటుంది…అందుకే “అడవి” రీ రిలీజ్ చేస్తున్నాం: రామ్ గోపాల్ వర్మ

పదేళ్లకు ఒకసారి యూత్ జనరేషన్ మారుతుంటుంది. అందుకే రీ రిలీజ్ సినిమాలకు విశేషమైన స్పందన లభిస్తోందని ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. గతంలో నితిన్, ప్రియాంక కొఠారి హీరోహీరోయిన్లుగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన “అడవి” సినిమాను విశాఖ టాకీస్ పతాకంపై నిర్మాత నట్టి కుమార్ విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. మళ్ళీ రీ రిలీజ్ సినిమాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాను ఈ నెల 14న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తన కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, “జనరేషన్ మారుతున్న ప్రతీసారి గతంలో వచ్చిన కొన్ని చక్కటి సినిమాలను చూడాలని మారుతున్నయూత్ కోరుకుంటుంటారు. అప్పట్లో ఎలా తీశారు? ఎందుకు తీశారు? ఇంకా టెక్నికల్ గా అప్పడు వచ్చిన అప్ డేట్స్ వంటివి చూడాలని మారుతున్న జనరేషన్ ఆశిస్తారు. “అడవి” సినిమానే తీసుకుంటే ఫారెస్ట్ ఫోటోగ్రఫీ, సాంగ్స్, సౌండ్ వంటివన్నీ సినిమాకు హైలైట్ గా ఉంటాయి” అని అన్నారు.
ఇక తాను గతంలో చేసిన పలు హిట్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా రామ్ గోపాల్ వర్మ బదులిచ్చారు. రైట్స్ ఉన్న ఆయా సినిమాల నిర్మాతలతో సంప్రదించి కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నామని వర్మ వివరించారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ తో కలసి కొన్ని సినిమాలను చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న కొత్త సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదని వర్మ చెప్పారు.
“అడవి” చిత్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ మాట్లాడుతూ, 12 ఏళ్ల క్రితం ఈ సినిమాను తెలుగులో నేనే విడుదల చేసాను. అప్పట్లో 3 రోజులపాటు అద్బుతమైన కలెక్షన్స్ వచ్చాయి. మొత్తం మీద బాగానే ఆడింది. టెక్నికల్ గా ఎప్పటికప్పుడు వండర్స్ క్రియేట్ చేసే రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమాను కూడా చక్కటి విజువల్ ట్రీట్ గా తెరకెక్కించారు. దాదాపు వంద థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం, ఇటీవలే “3” సినిమాను రీ రిలీజ్ చేస్తే, మేము ఊహించినదానికంటే చాలా గొప్ప స్పందన రావడం మాకెంతో ఉత్సాహాన్ని కలిగించింది. ఈ ప్రేరణతో ఈ నెల 15న ప్రభాస్ నటించిన “రెబల్” సినిమాను, ఈ నెల 22న “వర్షం” సినిమాను మా సంస్థ తరపున నేను రీ రిలీజ్ చేయబోతున్నాను. అలాగే రామ్ గోపాల్ వర్మతో కలసి కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేయబోతున్నాం. రామ్ గోపాల్ వర్మ గారు, నేను పాతికేళ్లుగా మంచి స్నేహితులం. కొద్దికాలం క్రితం మా మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలు సమసిపోయాయి. అప్పట్లో వివాదపరంగా ఎమోషనల్ గా అన్న మాటలకు ఆయనకు క్షమాపణలు చెబుతున్నాను. మళ్ళీ కలసి అనేక సినిమాలు చేయాలని అనుకుంటున్నాం” అని అన్నారు.

చిరంజీవిని గరికపాటి ఆలా అనడం తప్పే: రామ్ గోపాల్ వర్మ

కాగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మధ్య జరిగిన సంఘటన గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఇదే ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు వర్మ బదులిస్తూ, ఈ వార్త తనకు ఆలస్యంగా తెలిసిందని అన్నారు. అక్కడ చిరంజీవితో ఫోటోలు దిగే వ్యక్తులను కాకుండా చిరంజీవినే అనడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని వర్మ అన్నారు.