ఆరు రీమేక్ లు… అందరూ కలిసి అరడజను హిట్లు ఇస్తారా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటది, బాహుబలి తర్వాత ఇండియా వైడ్ పీరియాడికల్ సినిమాల హవా బాగా సాగింది. ఇప్పుడు తెలుగులో రీమేక్ ల ట్రెండ్ మొదలయ్యింది, ఒకప్పుడు తెలుగు సినిమాలని హిందీ వాళ్లు రీమేక్ చేసే వాళ్లు. అయితే ఇప్పుడు ఏ భాషలో సినిమా హిట్ అయినా దాన్ని మన వాళ్లు వెంటనే రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. మన దెగ్గర రైటర్స్ తక్కువ అయ్యారో లేక కొత్త కథలు లేవో కానీ వచ్చే ఏడాది దాదాపు అరడజను సినిమాలు రీమేక్ ల రూపంలో ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ఈ లిస్ట్ ఒకసారి చూస్తే,

పింక్:
ముందుగా ఈ లిస్ట్ లో చేర్చాల్సిన సినిమా పింక్. అమితాబ్, తాప్సి నటించిన ఈ సినిమాని తమిళ్ లో అజిత్ తో రీమేక్ చేసిన బోనీ కపూర్, ఇప్పుడు ఇదే మూవీని దిల్ రాజుతో కలిసి తెలుగులో రీమేక్ చేయనున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్, పింక్ తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయనున్నాడు. 25 సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ 8 రీమేక్ చిత్రాల్లో నటించాడు. వీటిలో గోకులంలో సీత, సుస్వాగతం, అన్నవరం, తీన్మార్, గబ్బర్ సింగ్, గోపాలా గోపాలా, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలు ఉన్నాయి. పింక్ పవన్ కెరీర్ లో 9వ రీమేక్, మరి రీమేక్ రీఎంట్రీతో పవన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

అసురన్:
ఇప్పటికే నాలుగు హిట్స్ ఇచ్చిన వెట్రిమారన్, ధనుష్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా వచ్చిన సినిమా అసురన్. కుటుంబం కోసం, మూడు ఎకరాల కోసం ఒక మాములు రైతు చేసే పోరాటమే అసురన్ సినిమా. రిలీజ్ అయిన నెల రోజుల్లో 180 కోట్లు రాబట్టిన అసురన్ సినిమాని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయనున్నాడు. సురేష్ ప్రొడక్షన్, కలైపులి థాను కలిసి నిర్మించనున్న ఈ మూవీకి హనూ రాఘవపూడి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. భారతంలో అర్జునుడు, త్రిమూర్తులు, బ్రహ్మ పుత్రుడు, ధృవ నక్షత్రం, టూ టౌన్ రౌడీ, చంటి, సుందరకాండ, చిన్నరాయుడు, కొండపల్లి రాజా, అబ్బాయి గారు, పోకిరి రాజా, తక్దీర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, సూర్యవంశం, రాజా, శ్రీను, వాసు, జెమినీ, ఘర్షణ, సంక్రాంతి, ఈనాడు, నాగవల్లి, బాడీగార్డ్, మసాలా, దృశ్యం, గోపాలా గోపాలా, గురు సినిమాలని రీమేక్ చేసిన వెంకీ ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఒరిజినల్ కథకి పూర్తిగా న్యాయం చేసే హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్, అసురన్ సినిమాలో శివసామీగా ఎలా మెప్పిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

Asuran Venkatesh

లూసిఫర్:
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ మూవీని మరో హీరో పృథ్వి రాజ్ డైరెక్ట్ చేశాడు. మలయాళ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ మూవీ 300 కోట్లు కలెక్ట్ చేసింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన లూసిఫర్ మూవీ రీమేక్ రైట్స్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోసం ఈ రైట్స్ కొన్న చరణ్, ఇందులో బాబాయ్ ని కూడా నటింపజేయాలనే ప్లాన్ వేస్తున్నాడు. మన ఊరి పాండవులు, ఇది కథ కాదు, ప్రేమ తరంగాలు, చట్టానికి కళ్లు లేవు, బిల్లా రంగ, బంధాలు అనుబంధాలు, దేవాంతకుడు, వేట, విజేత, ఆరాధన, పసివాడి ప్రాణం, త్రిమూర్తులు, రాజా విక్రమార్క, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్, ఘరానా మొగుడు, ఎస్.పి పరశురామ్, ది జెంటిల్ మాన్, మాస్టర్, స్నేహం కోసం, టాగోర్, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీ నంబర్ 150 సినిమాలని ఇతర భాషల నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకి తెచ్చాడు. దశాబ్దం తర్వాత రీఎంట్రీకి కూడా రీమేక్ నే నమ్ముకున్న చిరు, ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు. ఇది అయిపోగానే లూసిఫర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

తడం:
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన హీరో రా పో, అదే మన రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ సినిమా RED. ఇప్పటికే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ, తమిళ సినిమా తడంకి రీమేక్. అరుణ్ విజయ్ హీరోగా వచ్చోన ఈ సినిమా మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్. తెలుగులో కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ, నివేధా పేతురాజ్ హీరోయిన్లుగా నటించనున్నారు. రామ్ కెరీర్ లోనే ఇది ఫస్ట్ రీమేక్.

96:
ప్రేమకథా చిత్రాలు ఎన్ని వచ్చినా కొన్ని మాత్రమే ఆ లవ్ లోని మ్యాజిక్ ని చూపిస్తూ ఉంటాయి. అలాంటి జెన్యూన్ లవ్ స్టోరీస్ లో 96 ఒకటి. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ మూవీ కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. సూపర్ హిట్ అయిన 96, లీడ్ పెయిర్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే మూవీని దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. విజయ్ సేతుపతి, త్రిషలని రీప్లేస్ చేస్తూ శర్వానంద్, సమంతా లైన్ లోకి వచ్చారు. ఎప్పుడో మొదలైన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి సెకండ్ వీక్ లో 96 తెలుగు రీమేక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అంధాదున్:
ఒక స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా చేసి బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ ఇవ్వడమే కష్టమవుతున్న టైములో రెండేళ్లలో 7 సినిమాలు చేసి డబుల్ హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన ఏకైక హీరో ఆయుష్మాన్ ఖురానా. కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తున్న ఆయుష్మాన్, గతేడాది నటించిన సూపర్ హిట్ మూవీ అంధాదున్. మ్యూజికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ మూడు నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీని తెలుగులో యంగ్ హీరో నితిన్ రీమేక్ చేయనున్నాడు. సుధీర్ వర్మ ఈ రీమేక్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమాలన్నీ ఇతర భాషల్లో సూపర్ హిట్ అయినవే, అయితే ఒకప్పుడు ఒక భాషలో హిట్టైనా సినిమాని మరో రాష్ట్రంలోని ప్రేక్షకులు చూసే అవకాశం లేదు. ఇప్పుడు అలా కాదు డిజిటల్ ప్లాట్ఫామ్ ల రూపంలో ప్రతి సినిమా అందుబాటులోకి వస్తుంది. హిట్ అనే మాట వినగానే ప్రతి మూవీని సినీ అభిమానులు చూసేస్తున్నారు. మరి ఒరిజినల్ సినిమా ఫీల్ పోగొట్టకుండా, ఆ కథల నేటివిటీని మనకి అడాప్ట్ చేస్తూ మన ప్రేక్షకులని ఎలా అలరిస్తారు అనేది చూడాలి.