దిల్ రాజు V/S క్రాక్ డిస్ట్రిబ్యూటర్ మధ్య సద్దుమణిగిన వివాదం.. కేవలం నాలుగు గంటల్లోనే..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, క్రాక్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ మధ్య థియేటర్లకు సంబంధించి నెలకొన్న వివాదం గత కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. క్రాక్ సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ ప్రెస్‌మీట్ పెట్టి బహిరంగంగా దిల్ రాజుపై తీవ్ర విమర్శలు చేయడం ఇండస్ట్రీలో రచ్చకు దారితీసింది. క్రాక్ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ఆడుతున్నా.. ధియేటర్లు అన్నీ తీసేసి డబ్బింగ్ సినిమా అయిన మాస్టర్‌కి దిల్ రాజు, శిరీష్ రెడ్డి థియేటర్లు ఇచ్చారంటూ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దిల్ రాజు కాదు.. కిల్ రాజు అంటూ శ్రీనివాస్ తీవ్ర పదజాలంతో దుమ్మెత్తిపోశారు.

dilraju and krak distibuter

దిల్ రాజు చేస్తున్న అన్యాయంపై తాను పోరాటం చేస్తానంటూ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. దిల్‌రాజు తనను కించపరుస్తూ మాట్లాడిన ఆడియో కాల్స్‌ను కూడా శ్రీనివాస్ ప్రెస్‌మీట్‌లో బయటపెట్టాడు. దిల్ రాజు ఆగడాలపై థియేటర్లలో ప్రదర్శనలు ఆపేసి ఆందోళనలు కూడా చేయాలని శ్రీనివాస్ ప్లాన్ చేసుకున్నారు. దీని కోసం పలువురు టాలీవుడ్ ప్రముఖుల మద్దతు కూడా ఆయన కోరారు.

ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ ఈ నెల 20వ తేదీన క్రాక్ నిర్మాత మధుసూదన్ రెడ్డికి నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ ఒక లేఖ రాశారు. సక్సెస్‌పుల్‌గా ఆడుతున్న క్రాక్ సినిమాకు థియేటర్లను తీసేసి తమ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తున్న మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలకు దిల్ రాజు, శిరీష్ రెడ్డి థియేటర్లు కేటాయించారని లేఖలో పేర్కొన్నారు. గతంలో తాను నిర్మించిన గద్దలకొండ గణేష్ సినిమాకి కూడా థియేటర్ల విషయంలో అన్యాయం చేశారని, తనలాంటి యువ డిస్ట్రిబ్యూటర్లను తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దీనిపై చొరవ తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని శ్రీనివాస్ కోరారు.

దీనిపై ఇవాళ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి క్రాక్ నిర్మాత మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తమ సినిమా డిస్ట్రిబ్యూటర్‌కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం ఇప్పించాలని మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ ఫిర్యాదు అందిన వెంటనే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించింది. దిల్ రాజు, క్రాక్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాతల మధ్య నెలకొన్న వివాదాన్ని కేవలం 4 గంటల్లోనే పరిష్కరించింది. క్రాక్ డిస్ట్రిబ్యూటర్‌కు న్యాయం జరిగేలా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చేసింది. దీంతో సమస్యను పరిష్కరించిన తెలుగు చలనచిత్ర నిర్మాతలమండలి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి క్రాక్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్, నిర్మాత మధుసూదన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.