ఫిలిం జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కారిస్తా – తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

ఫిలిం జర్నలిస్టులు అన్నీ సమస్యలు పరిష్కరించేందుకు క్రుషి చేస్తానని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామి ఇచ్చారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డిని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం ఛాంబర్ లో ఘనంగా ఆత్మీయ సత్కార కార్య క్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఫిలిం జర్నలిస్టులు మీడియా లో ఎంతో కీలకం అని అన్నారు. మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులను, ఫిలిం జర్నలిస్టులను వేరు వేరుగా చూడలేమన్నారు. అయితే ఈమధ్య కాలంలో కొంత దూరం పెరిగిన మాట వాస్తవమే అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇరవై మూడు వేల అక్రిడిటేషన్ కార్డులు ఉన్నాయని , ఫిలిం జర్నలిస్టులకు అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు అందజేస్తామని అన్నారు. ఇళ్ళ స్థలాలు కూడా వర్కింగ్ జర్నలిస్టులందరికీ వచ్చేలా తనవంతు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కరెంటు కూడా లేని పరిస్థితుల దగ్గరి నుంచి ఫిలిం నగర్ , జూబిలీ హిల్స్ ప్రాంతంతో తనకు అనుబంధం ఉందని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ తనకు బాల్య మిత్రుడు అని చెప్పారు. ఫిలిం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు ఒక డెలిగేషన్ గా వేస్తే మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి తో చర్చిద్దాం అని పేర్కొన్నారు.

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు విరాహత్ ఆలీ మాట్లాడుతు ప్రింట్, ఎలక్ట్రానిక్ సపరేటు అసోసియేషన్ లా కాకుండా అందరూ ఒకే గొడుగు కిందికి వస్తే బాగుంటుందని సూచించారు. జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడిన నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అని అన్నారు. ఫిలిం జర్నలిస్టులు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ , నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, ఐ జె యు కార్యవర్గ సభ్యుడు సత్య నారాయణ, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కువిరాయని, ప్రధాన కార్యదర్శి మసాదె లక్ష్మి నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.