ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో మెగాస్టార్ చిరంజీవి చేసిన సైరా సినిమా వివాదం రోజురోజుకి ముదురుతోంది. నరసింహారెడ్డి వారసులు తమను చిత్ర నిర్మాత రామ్ చరణ్ మోసం చేశాడని, ఒప్పందం మేరకు సొమ్ము ఇవ్వలేదని తెలంగాణ హై కోర్ట్ లో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా జడ్జ్ ముందు తన వాదనలు వినిపించిన దర్శకుడు సురేందర్ రెడ్డి, సైరా బయోపిక్ కాదంటూ సంచలన కామెంట్ చేశాడు. సైరా సినిమా కథ 15 ఏళ్లుగా చిరు కోసం ఎదురు చూస్తోంది, మన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని తెరపై చూడడానికి యావత్ భారత దేశం ఎదురు చూస్తోంది. రిలీజ్ కి ఇంకో వారం సమయం కూడా లేని టైములో సురేందర్ రెడ్డి, సైరా బయోపిక్ కాదు అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ వార్త బయటకి రాగానే, సోషల్ మీడియాలో సైరా బయోపిక్ కానప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు ఎందుకు వాడుతున్నారు? వీరుడి కథ అనుకున్నాం కానీ కల్పిత కథతో సినిమా చేశామని ముందే ఎందుకు చెప్పలేదు? ఇండియాస్ ఫస్ట్ సివిల్ రెబల్లియన్ వార్ అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతోనే సినిమా చేయాలి, సైరా చిత్ర యూనిట్ కూడా చేసింది ఇదే కదా మరి బయోపిక్ కాదని సురేందర్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? సైరా చిత్ర యూనిట్ పాన్ ఇండియన్ సినిమా, 250 కోట్లతో మన తెలుగు వీరుడి కథతో తెరకెక్కించాం అని డబ్బాలు కొట్టేది ఇంతదానికేనా? బయోపిక్ కానప్పుడు అసలు పేర్లు వాడకుండా సినిమాలు చేయండి అంటూ ఎవరికి తోచిన విమర్శలు వాళ్లు చేస్తున్నారు.
ఈ విమర్శలని కాసేపు పక్కన పెడితే, ఈ సినిమా గురించి సురేందర్ రెడ్డి జడ్జి ఎదుట చెప్పిన మాటలు అక్షర సత్యం సైరా బయోపిక్ కాదు, అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కినా కూడా అది బయోపిక్ కాదు. ఎందుకంటే ఉయ్యాలవాడ నరసింహారెడీ స్వాతంత్య్ర సమరయోధుడు, అతని కథ దేశ సంపద. మన దేశంలో ఏ వ్యక్తి కథ అయినా వందేళ్లు దాటితే అది చరిత్ర అవుతుంది. ఒక చరిత్రతో ఎవరైనా ఏ భాషలో అయినా సినిమా చేసుకోవచ్చు. దానికి ఒకరి అంగీకారం, అనుమతి అవసరం లేదు. ఇది తెలుసు కాబట్టే సురేందర్ రెడ్డి సైరా సినిమా బయోపిక్ కాదు హిస్టారికల్ మూవీ అని చెప్పి ఉంటాడు. అలాగే ఈ వివాదాల కారణంగా సైరా విడుదలకి కోర్ట్ స్టే ఇస్తే పరిస్థితి ఏంటి అని కూడా మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎవరు అడ్డుపడినా సైరా సినిమా ఆగదు ఎందుకంటే గతంలో బాలీవుడ్ లో మంగళ్ పాండే కథతో తెరకెక్కిన సినిమా కూడా ఇలాంటి వివాదమే ఫేస్ చేసింది. 65 ఏళ్ల కథకే అప్పుడు కోర్ట్ మంగళ్ పాండే బయోపిక్ కాదు అనే చరిత్ర అనే తీర్పు ఇచ్చింది. అలాంటిది 172 ఏళ్ల క్రితం జరిగిన కథ చరిత్ర కాకుండా ఎలా ఉంటుంది. ఉయ్యాలవాడ నరసింహారెడీ కథ ముమ్మాటికీ చరిత్ర, అది మన సొంతం. ఆయన కథ ఏ ఒక్క వారసుడికో సొంతం కాదు, 120 కోట్ల భారతీయులు ఆస్థి. అంత గొప్ప వీరుడి కథని అక్టోబర్ 2న థియేటర్స్ లో మనం చూడబోతున్నాం. రిలీజ్ పై ఉన్న అనుమానాలని పక్కన పెట్టి, తెలుగు వాడు తెల్లదొరలకి ఎలా ఎదురు నిలిచాడో చూడడానికి సిద్ధం అవ్వడం.