సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఘట్టమనేని కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడూ కలిసినా ఆప్యాయంగా పలకరించుకునే ఈ కుంటుబాల మధ్య స్నేహ బంధం ఈ నాటిది కాదు. ఎన్టీఆర్, కృష్ణల కాలం నుంచి ఆనవాయితీగా వస్తూనే ఉంది. కృష్ణ చేసిన సినిమాలని ఎన్టీఆర్ అభినందించడం, మనస్పర్థలు వచ్చినా కలిసే ఉండడం ఈ రెండు ఫ్యామిలీస్ కి అలవాటు అయిన పని. 1967 నుంచి 80ల వరకూ దాదాపు అయిదు సినిమాలు కలిసి నటించిన ఈ ఇద్దరూ ఎంత స్టార్ హీరోలైనా అన్న తమ్ముడు అనే సంభోదించుకునే వారు. ఈ స్నేహం కారణంగానే 1970ల్లో ఎన్.టి.రామారావు కెరీర్ వరుస ఫ్లాప్లతో బ్లాక్ పీరియడ్ నడుస్తున్న టైములో కృష్ణ తమ స్వంత నిర్మాణ నిర్మాణ సంస్థ అయిన పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై “దేవుడు చేసిన మనుషులు” సినిమా చేశాడు.
సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో రామారావుతో పాటు కృష్ణ కూడా నటించాడు. ఎన్టీఆర్ కృష్ణల మధ్య స్నేహాన్ని అలానే నిలబెడుతూ బాలకృష్ణ, కృష్ణని బాబాయ్ అని ఇప్పటికీ ప్రేమగా పిలుస్తాడు. సొంత మనుషుల్లా కలిసి ఉండే ఈ రెండు కుటుంబాల మూడో తరం అయిన ఎన్టీఆర్ మహేశ్ బాబులు కూడా ఆ రిలేషన్ ని కాపాడుకుంటూనే వస్తున్నారు. సింహాద్రి ఫంక్షన్ కి వెళ్లిన మహేశ్, ఎన్టీఆర్ కి బెస్ట్ విషెస్ చెప్తే భరత్ అనే నేను సినిమా బహిరంగ సభకి వచ్చిన ఎన్టీఆర్… మా మహేశ్ అన్న అంటూ సంబోధిస్తూ వాళ్ల ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎంత గొప్పదో నిరూపించాడు. ఆ తర్వాత మైక్ అందుకున్న మహేశ్ కూడా తమ్ముడు తారక్ అంటూ ప్రేమని చూపించాడు. సమయం సందర్భం వచ్చిన ప్రతిసారీ కలిసి స్నేహంగా మెలిగే ఎన్టీఆర్ మహేశ్ బాబు ఆ వారసత్వాన్ని వాళ్ల పిల్లలకి కూడా అందిస్తారు అనడంలో సందేహం లేదు.