సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ క్రేజ్ మాములుగా లేదుగా

జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా వంటి సూపర్‌ హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజు గారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానేర్‌పై ప్రొడక్షన్‌ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌, ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇది డా|| ఎన్‌.శివ ప్రసాద్‌ నటించిన చివరి చిత్రం కావడం విశేషం. కాగా, ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ టీజర్‌ను శనివారం విడుదల చేశారు. తనదైన కామెడీ టైమింగ్‌లో సుధీర్‌ చెప్పే డైలాగ్స్‌ చాలా బాగున్నాయి. సుధీర్ కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ టీజర్ రిలీజ్ చేసిన అతి తక్కువ సమయంలోనే 2.2 మిలియన్ వ్యూస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.శేఖర్‌రాజు మాట్లాడుతూ – “మా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ టీజర్‌కి ఆడియన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా సుధీర్‌ కామెడీ టైమింగ్‌ గురించి మనందరికీ తెలిసిందే.. టీజర్‌లో ఆయన చెప్పే డైలాగ్స్‌కి మంచి అప్లాజ్‌ వస్తోంది. మా చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరిపి ట్రైలర్‌ని విడుదల చేస్తాం” అన్నారు. ఇదిలా ఉంటే సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ హీరోలుగా కూడా 3 మంకీస్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ టీజర్ కూడా ఇటీవలే రిలీజ్ అయ్యింది, సుడిగాలి సుధీర్ టీం అంతా కలిసి నటించడంతో 3 మంకీస్ టీజర్ కూడా వన్ మిలియన్ వ్యూస్ రాబట్టింది. కేవలం మూడు రోజుల గ్యాప్ లో రెండు టీజర్ లతో 3 మిలియన్ వ్యూస్ రాబట్టాడు అంటే సుధీర్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.