77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తిరుపతిలోని మోహనబాబు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం

77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు దేశం కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్య్రం అందించారు. ఈరోజు మనం ఇలా జీవిస్తున్నామంటే వారి త్యాగాలే కారణం.

ఈ పండుగను పురస్కరించుకొని తిరుపతిలోని మోహనబాబు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాను.

ఎందుకంటే నాకు జన్మనిచ్చిన జన్మభూమి మోదుగులపాళెం. ఒక నటుడుగా, ఒక నిర్మాతగా, రాజ్యసభ సభ్యునిగా, విద్యాప్రదాతగా ఎదగడానికి నా తల్లిదండ్రులు, నా గ్రామప్రజలు మూలకారణం. పల్లెటూరు నుండి డిల్లీ పార్లమెంటు వరకు నాప్రస్తానం సాగడానికి నాకు జన్మనిచ్చిన నా పల్లెటూరే కారణం.

అంతగొప్పగా ఎదగడానికి మూలమైన నా తల్లిదండ్రులను, జన్మభూమిని, ఆప్తులు, ఆత్మీయులైన మా గ్రామస్తులను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాను.

నాజన్మభూమిని ఎప్పుడూ మనసులో స్మరిస్తూ ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక ప్రణాళికను రూపొందించు కున్నాను. నేను స్థాపించిన విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటాలనుకున్నాను. దీనికి నాజన్మభూమి అయిన మోదుగులపాళెం నుండి 100 మంది మాగ్రామస్తులను అక్కడ ప్రవహించే స్వర్ణముఖీ నది ఇసుకను ఒక గుప్పెడు, వారి పొలంలోని మట్టిని గుప్పెడు తెమ్మన్నాను. దానితో పవిత్రమైన ఈరోజు ఇక్కడ మొక్కలు నాటుతున్నాను. ఈ మాటలు చెప్పగానే మాగ్రామస్తులు ఎంతో ఉప్పొంగిపోయారు. రెండు బస్సులలో వారిని ఇక్కడికి పిలిపించాను.

వారు తెచ్చిన ఇసుక, మట్టితో 100 మొక్కలు నాటించాను. అవి పెరిగి పెద్దవైతే వాటిని చూసిన ప్రతిసారీ నాకు నాతల్లిదండ్రులు, నాజన్మభూమి అందులోని మాగ్రామస్తులు గుర్తుకు రావాలన్నదే నా ఆశ ఆకాంక్ష.

ఈ 77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటాలనే సంకల్పం రావడానికి నాతల్లిదండ్రులైన స్వర్గీయ శ్రీ మంచు నారాయణస్వామి నాయుడు, స్వర్గీయ శ్రీమతి లక్ష్మమ్మ గార్ల ఆశీస్సులే కారణమని భావిస్తున్నాను.

ఇట్లు

మోహన్ బాబు