మే 28న ఎన్టీఆర్ 99వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళి అర్పించిన నందమూరి బాలకృష్ణ, ఒక మీడియా అతను అడిగిన ప్రశ్నకి సమాధానంగా… ఆయుర్వేద వైద్యంగురించి, ఆనందయ్య మందు గురించి స్పందించారు. తనకు ఆనందయ్య మందు మీద నమ్మకం ఉందని, ఆయుర్వేదాన్ని తాను నమ్ముతానని బాలయ్య చెప్పాడు. భారత దేశ ఆయుర్వేదానికి గొప్ప చరిత్ర ఉందని.. క్రీస్తు పూర్వంలోనే సుశ్రుతుడు అనే శస్త్రచికిత్స నిపుణుడు ఉండేవాడని.. ఆయన ఎన్నో సర్జరీలు చేశాడని.. మనం ఆయన్ని గుర్తుంచుకోకుండా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో రాయల్ కాలేజ్ ఫర్ సర్జరీలో తన విగ్రహం ఉందని బాలయ్య వివరించాడు.
అలాగే రాజమండ్రికి చెందిన దండిబట్ల విశ్వనాథ శాస్త్రిని నాజీలు తీసుకెళ్లి.. శరీర నిర్మాణం, వైద్యం గురించి వివరించే యజుర్వేదం, అధర్వణ వేదాలను తమ భాషల్లో తర్జుమా చేయించుకుని తమ వైద్య శాస్త్రాలను అభివృద్ధి చేసుకున్నారని బాలయ్య అన్నాడు. ఇలా భారతీయ ఆయుర్వేదానికి గొప్ప చరిత్ర ఉందని.. దాని గురించి చాలామందికి తెలియదని.. ఐతే మిగతా వాళ్లతో పోలిస్తే తనకు దీనిపై కొంచెం అవగాహన ఉందని.. ఆనందయ్య తయారు చేసే మందులో ఉపయోగించే పదార్థాలతో మందులు తయారు చేయడం ఎప్పట్నుంచో ఉన్నదే అని బాలయ్య వ్యాఖ్యానించాడు. బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ ఛైర్మెన్ అయిన బాలకృష్ణ ఆయుర్వేదం గురించి ఇంత గొప్పగా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఆనందయ్య మందు గురించి స్పందించిన మొదటి సినిమా వ్యక్తి కూడా బాలయ్యనే అవ్వడం విశేషం.