ఫిబ్రవరి 3 నుంచి థియేటర్లలో ‘మాస్టర్’ బంద్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి నటించిన మాస్టర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై భారీ వసూళ్లను మూటకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ.250 కోట్లకుపై కలెక్షన్లను సాధించి.. విజయ్ కెరీర్‌లోనే వరుసగా రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసిన నాలుగో సినిమాగా నిలిచింది. తమిళనాడులో వెయ్యి థియేటర్లలో ఈ సినిమా విడుదల అవ్వగా.. ఒక్క తమిళనాడులోనే రూ.150 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. విజయ్ తలపతికి ఉన్న క్రేజ్‌తో పాటు విలన్‌గా విజయ్ సేతుపతి చేసిన యాక్టింగ్ ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు.

master removed from theaters

అయితే జనవరి 29 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో మాస్టర్ స్ట్రీమింగ్ అవుతోంది. మరికొద్దిరోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని మాస్టర్ నిర్మాతలను ఎగ్జిబిటర్లు కోరారు. కానీ నిర్మాతలు ఒప్పుకోలేదు. దీంతో సినిమా విడుదలైన 16 రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేస్తున్నారు కాబట్టి.. మాస్టర్ సినిమాకు వచ్చిన లాభాల్లో 10 శాతం ఇవ్వాలని థియేటర్ల యాజమాన్యాలు కోరగా… దీనికి కూడా మాస్టర్ నిర్మాతలు ఒప్పుకోలేదు.

ఈ క్రమంలో ఫిబ్రవరి 3 నుంచి థియేటర్లలో మాస్టర్ సినిమాను తీసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో వచ్చిన క్రమంలో థియేటర్లలో తీసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.