ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పత్రికా రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రధాన మీడియాతోపాటు డిజిటిల్ మీడియాలో వెబ్‌సైట్స్, సోషల్ మీడియా, ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రసార, సమాచారం రంగంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే వేగంగా మార్పులు జరుగుతున్న కారణంగా జవాబుదారీతనం లోపిస్తున్నదనే విమర్శలు, వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వార్తల ప్రసారం, ప్రచురణ విషయంలో జవాబుదారీతనం, ఉండేలా.. కొన్ని ప్రతికూల అంశాలను కంట్రోల్ చేసేందుకు, టార్గెట్ ఆడియెన్స్‌కు వాస్తవాలను చేరవేసేందుకు తెలుగు సినీ, మీడియా రంగానికి సంధాన కర్తగా వ్యవహరించే విధంగా తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ (Telugu Film Digital Media Association) ఆవిర్భవించింది. ఇప్పటికే సినీ జర్నలిస్టుల సంక్షేమం కోసం విశేషంగా సేవలు అందిస్తున్న తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ (TFJA)కు అనుబంధంగా సేవలు అందించేందుకు ఈ అసోసియేషన్ ఏర్పాటు జరిగింది.
ఈ అసోసియేషన్ కార్యవర్గంలో అధ్యక్షులుగా వీ ప్రేమ మాలిని, ప్రధాన కార్యదర్శిగా వీఎస్ఎన్ మూర్తి, కోశాధికారిగా శివ మల్లాల, ఉపాధ్యక్షులగా నిశాంత్ ఎన్, రాజబాబు అనుముల, సంయుక్త కార్యదర్శిగా బీ వేణుగోపాల్, ఎండీ అన్వర్‌తోపాటు 30 మంది కార్యవర్గ సభ్యులు ఉన్నారు.
ఈ ఆవిర్బావ సమావేశంలో సినీ ప్రముఖులు, నిర్మాతలు దిల్ రాజు, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే టీఎఫ్‌జేఏ కార్య నిర్వాహక కమిటీ సభ్యులు, ప్రసిడెంట్ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు, కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్, సభ్యులు జీవీ, శేఖర్, వీఆర్ మథు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ కార్యవర్గాన్ని ప్రకటించారు.
ఈ సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ.. సినీ జర్నలిస్టులు, సినిమా పరిశ్రమ ఓ కుటుంబంలా ఉంటుంది. ఎప్పటి మాదిరిగానే టీఎఫ్‌జేఏకు అందించిన సహకారం, ప్రోత్సాహాన్ని నూతనంగా ఎంపికైన అసోసియేషన్‌కు ఉంటుంది. జవాబుదారీతనం లక్ష్యంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.
నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిజాన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటారు. వాస్తవాలను నిష్పక్షపాతంగా అందించాలని సూచించారు. సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్టులు ఓ భాగమని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పోటీ ప్రపంచంలో వేగంగా వార్తలు అందించాలనే ప్రయత్నంలో కొన్ని అవాస్తవాలను ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని అన్నారు.
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ, సినీ జర్నలిస్టులు పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీడియా విస్తృతి, పరిధి పెరిగిన నేపథ్యంలో వార్తలపై నియంత్రణ అవసరం. సినిమా పరిశ్రమకు మంచి జరిగితే వందలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఆ ప్రయత్నంగా జర్నలిస్టులు కృషి చేయాలని కోరారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వైజే రాంబాబు, లక్ష్మీనారాయణ, నాయుడు, ప్రేమ మాలిని, మూర్తి, శివ మల్లాల, నిషాంత్, రాజబాబు, సువర్ణ మాట్లాడుతూ.. జవాబుదారీతనం, నిష్ఫక్షపాతంగా వ్యవహరించేలా చర్యలు తీసుకొంటామని అన్నారు.