సినీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా – మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

సినిమా జర్నలిస్టుల సాధక బాధకాలు ఏమిటో తనకు పూర్తిగా అవగాహన ఉందని, వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటానని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. “ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్” నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. ప్రభు, ప్రధాన కార్యదర్శి పర్వతనేని రాంబాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మంత్రి శ్రీనివాస యాదవ్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు.

సినిమా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వినతి పత్రం ఇచ్చి వివరించారు. “ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్” ఏర్పడి 50 ఏళ్లు అయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించాలనుకుంటోందని, దీనికి హాజరు కావాలని కూడా కోరారు. అలాగే ఫిలిం జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ సౌకర్యం, గృహవసతి కల్పనకు కూడా కృషి చేయవలసిందిగా కోరారు. దీనికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ.. “చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడి నప్పటి నుంచి సినిమా జర్నలిస్టుల పరిస్థితి ఏమిటో తనకు పూర్తి అవగాహన ఉందని, సినిమా రంగాన్ని నమ్ముకుని ఎందరో ఎంతో ఎదిగినా సినిమా జర్నలిస్టుల పరిస్థితి మాత్రం అలాగే ఉండటం శోచనీయం” అన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వహించబోయే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు తాను తప్పక హాజరవుతానని, తన దృష్టికి వచ్చిన సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి కృషిచేస్తానని, ప్రభుత్వ పరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నా వాటిని సినిమా జర్నలిస్టులకు కూడా వర్తించేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ సందర్బంగా “ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్” అధ్యక్షుడు ఎ. ప్రభు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను శాలువాతో సత్కరించగా ప్రధాన కార్యదర్శి పర్వతనేని రాంబాబు బోకే అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నాగేంద్రకుమార్ పసుమర్తి, ట్రెజరర్ హేమసుందర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ DCసురేష్, మల్లికార్జున్, కుమార్ ఉన్నారు.