ముదురుతున్న శంకర్, లైకా వివాదం…

ఏ టైములో ఇండియన్ 2 మొదలుపెట్టాడో తెలియదు కానీ అప్పటినుంచి డైరెక్టర్ శంకర్ ఇప్పటివరకూ మనశ్శాంతిగా నిద్రపోయి ఉండడు. షూటింగ్ ఆగిపోవడం దెగ్గర నుంచి అది ముదిరి ముదిరి లైకా ప్రొడక్షన్‌ తో పెద్ద వివాదంగా మారింది. భారీ బడ్జట్ తో తెరకెక్కాల్సిన ‘ఇండియన్‌ 2’ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశాకే శంకర్‌ తన కొత్త సినిమాను మొదలుపెట్టాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ గతంలో కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇరు వర్గాలు కూర్చోని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించిన కోర్ట్, ఈ కేసుని జూన్‌కు వాయిదా వేసింది.

ఈ సమయంలో శంకర్, తెలుగులో రామ్ చరణ్ తో ఒక మూవీ… హిందీలో రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ అనౌన్స్ చేశాడు. దీంతో లైకా ప్రొడక్షన్‌ మరో అడుగు ముందుకేసి ‘ఇండియన్‌ 2’ని పూర్తి చేసే వరకు శంకర్‌ కొత్త చిత్రం మొదలుపెట్టకుండా చూడాలని తెలుగు, హిందీ ఫిల్మ్‌ఛాంబర్స్‌కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కానీ ఇక్కడ లైకా కానీ శంకర్ కానీ తగ్గకపోవడమే ఈ వివాదం ముదరడానికి కారణం అవుతుంది. హీరో కమల్ హాసన్ అయినా పెద్ద మనిషి తరహాలో ఇద్దరినీ కూర్చోబెట్టి ఈ సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది. మరి ఈ వివాదం త్వరగా ముగుస్తుందా? శంకర్ ఇతర ప్రాజెక్ట్స్ ని చేస్తాడా? లేక ఇండియన్ 2నే తెరకెక్కిస్తాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.