ఛార్మి కౌర్… చార్మింగ్ బ్యూటీగా తెలుగు సినీ అభిమానులతో పిలిపించుకున్న నార్త్ అమ్మాయి బర్త్ డే విషెస్ చెప్తూ టీ ఎఫ్ పీ సీ స్పెషల్ ఆర్టికల్. 17 మే 1987న మహారాష్ట్రలో పుట్టిన ఛార్మి, 15 ఏళ్లకే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. 2002లో నీ తోడు కావాలి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఛార్మి, అదే ఏడాదిలో తమిళ్, మలయాళంలతో పాటు హిందీలో కూడా నటించింది. అన్ని భాషల్లో ఒకే ఏడాది డెబ్యూ ఇచ్చిన ఛార్మి, గౌరీ మాస్ చక్రం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగార్జున, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో తన గ్లామర్ తో యూత్ ని ఫిదా చేసింది. ముఖ్యంగా శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మి స్కిన్ షోకి ఫ్లాట్ అవ్వని కుర్రాడే ఉండడు. ఒకానొక టైంలో ఛార్మి పోస్టర్ పైన కనిపిస్తే చాలు థియేటర్ కి వెళ్దాం అనుకున్న వాళ్లు ఎంతో మంది. సింపుల్ అండ్ స్ట్రెయిట్ గా చెప్పాలి అంటే “She is like a old wine, ఎంత పాతగా అయితే అంత టేస్టీగా ఉంటుంది అన్నట్లు, చూస్తున్న కొద్దీ చూడాలి అనిపించే అందం ఆమె సొంతం”. అదే పూరి జగన్నాధ్ భాషలో చెప్పాలి అంటే దేశముదురు సినిమాలో ఆయన రాసిన “చూడగా చూడగా నా కళ్లు బ్రైట్ అయిపోతాయి మావా” అనే డైలాగ్ ఛార్మికి పర్ఫెక్ట్ ఎగ్సాంపుల్.
అంతగా తన అందంతో ఆకట్టుకున్న చార్మింగ్ బ్యూటీ, 2005లో అనుకోకుండా ఒక రోజు మూవీతో తనలో అందం మాత్రమే కాదు యాక్టింగ్ కూడా ఉందని ప్రూవ్ చేసింది. ఈ మూవీలో ఛార్మిని చూసిన వాళ్ళు, బ్యూటీ మీట్స్ టాలెంట్ అంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేశారు. ఇది ఛార్మి కెరీర్ ని టర్న్ చేసిన మూవీ. ఇక్కడి నుంచి గ్లామర్ అండ్ యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ చేస్తూ కెరీర్ బిల్డ్ చేసిన ఛార్మి… లక్ష్మి, స్టైల్, పౌర్ణమి, రాఖి, మంగళ సినిమాలతో స్టార్ డమ్ ని అందుకుంది. డాన్స్, గ్లామర్ యాక్టింగ్ ఈ మూడు ఎలిమెంట్స్ ని ఎక్కడా తగ్గకుండా కెరీర్ ని బాలన్స్ చేస్తూ వచ్చిన ఛార్మి, 2011లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి బుడ్డా హోగా తేరా బాప్ సినిమాలో నటించింది. 2013 వరకూ ప్రతి ఏడాది నాలుగైదు సినిమాలు చేసిన ఛార్మి ఆ తర్వాత కాస్త యాక్టింగ్ తగ్గించి ప్రొడక్షన్ వైపు వెళ్లిపోయింది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి ఛార్మి ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ సినిమా జ్యోతి లక్ష్మి. వైశ్య పాత్రలో తన ట్రేడ్ మార్క్ గ్లామర్ అండ్ యాక్టింగ్ అని అద్భుతంగా చూపించిన ఛార్మి, ఆడియన్స్ ని మళ్లీ తన పేరు వింటేనే థియేటర్స్ వైపు వచ్చేలా చేసింది. 2015 నుంచి ప్రొడ్యూసర్ గానే కంటిన్యూ అవుతున్న ఛార్మి, పూరి జగన్నాధ్ కి బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడు పూరిని మోసం చేసిన సమయంలో, అతను అప్పుల్లో ఉన్న సమయంలో ఛార్మి పూరికి ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పది. ఈ ఇద్దరి మధ్య కాంబినేషన్ ఇచ్చే రిజల్ట్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది.
ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఒక స్టార్ హీరో పక్కన చేయగానే తమని తాము పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకుంటారు కానీ… బిగ్ బి కంటే పెద్ద స్టార్ ఇండియాలో ఉంటాడా? అలాంటి అమితాబ్ తో 24ఏళ్లకే ఛార్మి నటించింది. ఇదే కాదు 13 ఏళ్ల కెరీర్ లో భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసిన ఛార్మి, 9 బెస్ట్ యాక్ట్రస్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. వీటిలో మంత్ర, మంగళ సినిమాలకి నంది అవార్డ్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ ప్రొడ్యూస్ చేస్తున్న ఛార్మి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి రెడీ అవుతోంది.