ఆ బ్యూటీ బాలకృష్ణ తర్వాత మహేశ్ తోనే…

ఏజ్ తో సంబంధం లేకుండా గ్లామర్ ని మైంటైన్ చేస్తున్న ఇండియన్ హీరోయిన్స్ లో శిల్పా శెట్టి ఒకరు. 45 ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం తగ్గని అందం ఆమె సొంతం. తెలుగులో వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో నటించిన శిల్పా శెట్టి, 2001లో నందమూరి బాలకృష్ణ నటించిన భలేవాడివి బాసు సినిమా తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. రెండు దశాబ్దాలు గడుస్తున్నా శిల్పా శెట్టి మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు కానీ అతి త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో టాలీవుడ్ లో రి-ఎంట్రీ ఇవ్వనుందట.

ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం సర్కార్ వారి పాట మూవీ చేస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు, తన నెక్స్ట్ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడు. ఈ కాంబోలో అతడు, ఖలేజా తర్వాత మూడో సినిమా వస్తుండడంతో అభిమానులు, ట్రేడ్ వర్గాల అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ లో ఓ ముఖ్య పాత్ర కోసం త్రివిక్రమ్ శిల్పతో సంప్రదింపులు జరుపుతున్నారట. అన్నీ ఓకే అయితే రెండు దశాబ్దాల తర్వాత శిల్పా శెట్టి తెలుగు తెరపై కనిపిస్తుంది.