పవన్ కళ్యాణ్ కథలో సాయి శ్రీనివాస్ హీరోనా?

సంతోష్ శ్రీనివాస్ గుర్తున్నాడా? రామ్ పోతినేనికి కందిరీగ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు. చాలా కాలంగా ఒకే కథని పట్టుకోని ట్రావెల్ అవుతున్నాడు. తమిళ స్టార్ అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాకి తెలుగుకు తగ్గట్లు మార్పులు చేసిన సంతోష్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆ మూవీ చేయాలని చాలా ట్రై చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ కూడా సంతోష్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి రెడీ అయ్యి పవన్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో, సంతోష్ శ్రీనివాస్ అదే కథని రవితేజకి వినిపించాడు. మైత్రి దగ్గర రవితేజ డేట్స్ ఉండడంతో, వాళ్లు కూడా రెడీ అయ్యారు. రవితేజ, సంతోష్ శ్రీనివాస్, మైత్రీ మూవీ మేకర్స్ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళింది.

రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైన ఈ సినిమాలో ఒక రైన్ ఫైట్ ని కూడా షూట్ చేశారు. ఆ తర్వాత ఏమయ్యిందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా ఆగిపోయింది. మళ్లీ సంతోష్ శ్రీనివాస్ పరిస్థితి మొదటికి వచ్చింది. తాజాగా సంతోష్ శ్రీనివాస్ చెప్పిన పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి సంతోష్ చెప్పిన కథ, పవన్ కోసం రాసిన కథేనా లేక కొత్తదా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.