ఇండియన్ అవెంజర్స్ రేంజులో సూర్యవంశీ

హాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయితే అదే కోవలో చాలా సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇద్దరు సూపర్ హీరో సినిమాలు వచ్చి హిట్ అయితే ఆ రెండు సినిమాలని ఎలా లింక్ చేయాలి? ఎలా ఆ ఇద్దరినీ ఒక చోట కలపాలి అనేది హాలీవుడ్ వాళ్లకి చాలా బాగా తెలుసు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రతి సూపర్ హీరో సినిమా అలా వచ్చినవే. ముఖ్యంగా అవెంజర్స్ సినిమాలో అంతమంది హీరోలని ఒకే చోట కలపడం వెనక ఆరు సినిమాల ట్రావెల్ ఉంది. ప్రతి హీరో ఎంట్రీకి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. జనరల్ గా వేరు వేరు సినిమాల్లో ఒకే లాంటి కథతో ట్రావెల్ చేసే హీరోలని కలిపి ఒక సినిమాలో చూపించడం చాలా అరుదు.

బాలీవుడ్ లో ఇలాంటి ప్రయత్నం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుంది. తాజాగా హిట్ సినిమాలకి, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన రోహిత్ శెట్టి గతకొంత కాలంగా కాప్ డ్రామాలు చేస్తూ హిట్స్ అందుకున్నాడు. ముందుగా అజయ్ దేవగన్ తో సింగం సినిమా చేసిన రోహిత్ శెట్టి, ఆ తర్వాత రణ్వీర్ సింగ్ తో సింబా సినిమాని చేసి సూపర్ హిట్ ఇచ్చాడు. టెంపర్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన సింబా సినిమాలో అజయ్ దేవగన్ పాత్రని కలపడం చాలా ప్లస్ అయ్యింది. సింగం ఫ్రాంచైజ్ అభిమానులంతా సింబాలో అజయ్ దేవగన్ ని చూసి ఫుల్ ఖుషి అయ్యారు. సింబా సినిమా క్లైమాక్స్ లోనే తన నెక్స్ట్ సినిమా సూర్యవంశీ అని అనౌన్స్ చేసిన రోహిత్ శెట్టి, అక్షయ్ కుమార్ తో క్యామియో ప్లే చేయించాడు. రీసెంట్ గా సూర్యవంశీ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. అక్షయ్ కుమార్ కూడా రోహిత్ శెట్టి పోలీస్ గ్యాంగ్ లో కలవడంతో, సూర్యవంశీని సింబా సింగం కూడా కలిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో రోహిత్ శెట్టి ముగ్గురు సూపర్ కాప్స్ ని ఒక చోట కలిపాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి బయటకి వచ్చి బాలీవుడ్ సినీ అభిమానులని ఆకట్టుకుంటుంది. ఇక ఈ బ్యాచ్ లో మిగిలింది సల్మాన్ ఖాన్ మాత్రమే, ముగ్గురు కాప్స్ కి చుల్ బుల్ పాండే కూడా కలిస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ముందెన్నడూ చూడని మంచి ఫ్రాంచైజ్ అయ్యే అవకాశం ఉంది.