టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ చాలా మంది ఇప్పటికే నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో తమ క్రేజ్ అండ్ బ్రాండ్ వ్యాల్యూతో చిన్న బడ్జెట్ తో సినిమాలకు పెద్ద ప్రమోషన్ ను నిర్వహించి సక్సెస్ లు అందుకుంటున్న హీరోలు, అలాగే దర్శకులు చాలా మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా నిర్మాతగా సక్సెస్ అయిన పాపులర్ డైరెక్టర్స్ లో సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుకుమార్ తన పేరు మీద సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ స్థాపించి ఇప్పటికే కొన్ని సినిమాలను సమర్పించాడు. సినిమాల నిర్మాణం వ్యవహారంతో పాటు ఆ సినిమాల స్క్రిప్ట్ విషయంలో కూడా సుకుమార్ భాగస్వామ్యం ఉంటుంది.
ఇదే కాదు ఆయన తర్వాత పలువురు దర్శకులు కూడా ఆయన మాదిరిగానే నిర్మాతలుగా మారారు. ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా నిర్మాతగా మారాడు. ఆయన పేరుతో అంటే కొరటాల శివ సమర్పణలో మొదటి సినిమా సెట్స్ మీదకి రాబోతోంది. దీనికి సంబంధించిన అధికారక ప్రకటన తాజాగా వచ్చింది. విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా వి.వి. గోపాల కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా విజయవాడ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందబోతుండగా, ఇందులో సత్యదేవ్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.
దర్శక, నిర్మాత లు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను నిర్మించడానికి కొరటాల శివ ముందుకు వచ్చారు. సత్యదేవ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమాను అనౌన్స్ చేయడం విశేషం. కాగా కొరటాల శివ ఇప్పుడు ఆచార్య సినిమాను మెగాస్టార్ తో చేస్తున్నాడు. ఈ ఆచార్య సినిమా కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ సాధిస్తుందని చిత్ర బృందం, ఇండస్ట్రీ వర్గాల వారు చెప్తున్నారు. చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఆచార్య తర్వాత ఎన్టీఆర్ 30 సినిమాను కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. మొత్తానికి డైరెక్టర్ గా సక్సెస్ లు అందుకున్న కొరటాల ఇప్పుడు నిర్మాతగా మారడం ఆసక్తికరమైన విషయం.