మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ, శ్రీరామ దండకం ఆలపించి నందమూరి అభిమానులకి కానుకగా ఇచ్చారు. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఈ శ్రీ రామ దండకాన్ని ఎన్.బి.కె. ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. బాలయ్య ముందుమాటతో మొదలైన ఈ శ్రీరామ దండకం, ఆ తర్వాత శ్రీరామునిగా ఉన్న తారక రామారావు స్టిల్స్ ఒక్కొక్కటీ తెరపై వస్తుంటే శ్రీరామ దండకం వినిపించింది. ఈ శ్రీరామ దండకం నిడివి 3.15 నిమిషాలు ఉంది.
ఈ శ్రీరామదండకం ఆలపించడం గురించి ఎన్టీఆర్ ఘాట్ దెగ్గర మాట్లాడుతూ బాలకృష్ణ “ధర్మం లోపించిన సమయమిది. ధర్మానికి ప్రతిరూపం శ్రీరామ చంద్రుడు. శ్రీరామ చంద్రుని పాత్రకు వెండితెరపై నాన్నగారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ సమయంలో ఆ శ్రీరాముని మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నాన్నగారి జయంతి సందర్భంగా అందరికీ మంచి జరగాలని, స్వస్థత చేకూరాలని, కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కలగాలని శ్రీరామ దండకాన్ని ఆలపించాను” అని అన్నారు. దీనికి తెలుగు ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో బాలయ్య ఆలపించిన విధానానికి ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి.