30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మణిరత్నం అంజలి సినిమా

మణిరత్నం హృదయంలో నుంచి జాలువారిన ఓ గొప్ప చిత్రం ‘అంజలి’. ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏండ్లు పూర్తయ్యాయి. 1990 లో విడుదలైనప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా రాణించినప్పటికీ.. పెద్దగా వసూళ్లు సాధించి ఉండకపోవచ్చు. అయినప్పటికీ.. మణిరత్నం ‘అంజలి’ అప్పటికీ.. ఇప్పటికీ.. ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంటుండటం విశేషం.

‘అంజలి’ సినిమాలో చాలా సున్నితమైన విషయాన్ని తీసుకుని మణిరత్నం ఒక అద్భుత సెల్యులాయిడ్ ను తీర్చిదిద్దారు. అప్పటి వరకు చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ సినిమా. నాయగన్ , అగ్ని నాట్చాతిరామ్, గీతాంజలి వంటివే కాకుండా సామాజికాంశాలతో కూడిన సినిమా కూడా తీయగలనని మణిరత్నం నిరూపించారు. మేధో వైకల్యం ఉన్న ఒక చిన్న అమ్మాయి కథను, ఆమె చుట్టూ అల్లుకున్న కుటుంబం, సమాజం దృక్పథం ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పగలిగారు. ఈ చిత్ర కథకు ఈనాటికీ భారీ సామాజిక ప్రాముఖ్యత ఉంది. స్క్రీన్ ప్లే ద్వారా మానసిక బాధను ఎత్తిచూపారు. మేధో వైకల్యం ఉన్న పిల్లవాడిని పెంచడంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సవాళ్లను, అలాంటి పిల్లలతో వ్యవహరించడంలో పరిపక్వత, సున్నితత్వం .. ఇలా ఎన్నో విషయాలను అందంగా మనుసులకు హత్తుకునేలా స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకోవడం వల్లనే ఘన విజయం సాధించారని చెప్పవచ్చు. రఘువరన్, రేవతి, బేబీ షామిలి, మాస్టర్ తరుణ్ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్శణ అని చెప్పుకోవాలి.