ప్రముఖ తెలుగు రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆనందో బ్రహ్మ నవల సినిమా హక్కులను అమెరికాలో స్థిరపడ్డ ప్రముఖ తెలుగు దర్శక నిర్మాత ముక్తేశ్ రావు మేక సొంతం చేసుకున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మూడు హాలీవుడ్ సినిమాలు నిర్మిస్తున్న ఆయన ఆనందో బ్రహ్మ నవలను తెరకెక్కించే ఆలోచనలో హక్కులు సొంతం చేసుకున్నారు. 1729 పిక్చర్స్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నది.
మనుషుల మధ్య సంబంధాలను, ఆత్మీయానుబంధాలను పలికించిన ఈ నవల త్వరలో చిత్రరూపంలో తెరపై అలరించనుంది. ఓం పల్లెటూరి యువకుడు పట్నం వస్తే.. అతడిని ఓ గృహిణి సేద తీరుస్తుంది. వారిద్దరి మధ్య ఉన్నది ఏంటి? ప్రేమా? ఆకర్షణా? అనుబంధమా? సెక్సా? అనే ఆకట్టుకునే కథనంతో యండమూరి ఈ నవల అల్లారు. ఆత్మీయానుబంధాల కలబోతగా కల ఈ నవలను అధునాతన టెక్నాలజీతో ముక్తేశ్ రావు మేక తెరకెక్కించనున్నారు.
2020 ఫిబ్రవరిలో ముక్తేశ్ రావు ఇండియా వచ్చారు. ఆయన యండమూరి గారితో మాట్లాడి ఆనందో బ్రహ్మ పుస్తకాన్ని తనకి కావాలన్నారు. దానికి యండమూరి గారు.. ముందు ఎందుకు? ఏమిటి అని ప్రశ్నలడిగినా.. చివరకి ముక్తేశ్ రావు గారికి ఆ పుస్తకం మీద ఉన్న వాత్సల్యాన్ని తెలుసుకొని తప్పకుండా సినిమా తీసేందుకు ఒప్పుకుంటానని మాట ఇచ్చారు. 1984లో ఉన్నప్పుడు ముక్తేశ్ ముందు ఈ పుస్తకాన్ని చదివారు. ఆ సమయంలో ఆయన వయసు 12 సంవత్సరాలు. ఆ పుస్తకం ఎందుకో తనకు బాగా నచ్చింది. ఇది సినిమాగా వస్తే బాగుంటుందని అనిపించింది. కానీ ఆ వయసులో తనకు సినిమా గురించి తెలియదు. ఆ తర్వాత తను చదువు బిజీలో పడిపోయాడు. పై చదువుల నిమిత్తం యూఎస్ వెళ్లాడు. కానీ ఆనందో బ్రహ్మ పుస్తకం మాత్రం వెంట తీసుకెళ్లడం మరువలేదు.
2009లో పని మీద ఇండియా వచ్చారు ముక్తేశ్ రావు. ఆ సమయంలో యండమూరి గారిని కలిసి ఆనందో బ్రహ్మ రైట్స్ రెండు సంవత్సరాలకు తీసుకున్నారు. కానీ ఆ సమయంలో సినిమా నిర్మాణం చేపట్టలేకపోయారు. ఆ తర్వాత 1729 పిక్చర్స్ స్థాపించి హాలీవుడ్లో నిర్మాణం చేపట్టారు. ఇటీవల ఇండియా వచ్చి మళ్లీ ఆనందోబ్రహ్మ నవల హక్కులను పొందారు. త్వరలోనే ఈ సినిమా నిర్మాణం చేస్తానంటున్నారు. గోదావరి నది తీరాన ఈ కథ సాగుతుంది. కానీ మిసిసిప్పీ తీరాన కూడా ఈ కథను నడిపించవచ్చు. ఇదొక యూనివర్సల్ స్టోరీ. నా 35యేండ్ల కల సాకారం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది* అంటున్నారు ఈ చిత్ర హక్కులను తీసుకున్న ముక్తేశ్ రావు మేక.
ఆనందో బ్రహ్మ తనకు నచ్చిన నవల అని, దాన్ని సినిమాగా తీయాలంటే చాలా ధైర్య సాహసాలు ఉండాలి. తన మిగితా నవలల రైట్స్ అమ్ముడు పోయినంత వేగంగా ఈ నవల అమ్ముడు పోలేదని ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంధ్రనాథ్ అన్నారు. ఈ పుస్తకాన్ని సినిమాగా తెరకెక్కించాలనుకున్నా.. రకరకాల కారణాల వల్ల తీయలేకపోయారు. అటువంటి సమయంలో ముక్తేశ్‌రావు గారు ఈ నవల రైట్స్‌ను కొనడానికి ముందుకు వచ్చారు. అమెరికాలో స్థిరపడి, సినిమాలను నిర్మిస్తున్న ముక్తేశ్‌రావు ఈ నవల రైట్స్‌ను సొంతం చేసుకోవడం గొప్ప విషయమని యండమూరి అన్నారు. స్వీయ దర్శకత్వంలో ముక్తేశ్ రావు గారు నిర్మిస్తున్న ఈ చిత్రం.. భవిష్యత్తు, గతం రెండూ మిలితమైన ఈ నవలను చిత్రంగా తెరకెక్కించాలంటే ధైర్య సాహసాలతో కూడిన పని అని యండమూరి అభిప్రాయపడ్డారు.