ఏప్రిల్‌ 23న విజయ్‌ సేతుపతి, జయరామ్‌ నటించిన ‘రేడియో మాధవ్‌’!!

విజయ్‌ సేతుపతి, జయరామ్‌ హీరోలుగా నటించిన మలయాళ సినిమా ‘మార్కోని మతాయ్‌’. గుండేపూడి శీను సమర్పణలో లక్ష్మీచెన్నకేశవ ఫిల్మ్స్‌ అధినేత, నిర్మాత డి.వి. కృష్ణస్వామి ఈ చిత్రాన్ని ‘రేడియో మాధవ్‌’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జంటగా నటించిన మలయాళ చిత్రాన్ని తెలుగులో ‘హేయ్ పిల్లగాడ’ పేరుతో డి.వి. కృష్ణస్వామి విడుదల చేశారు. ‘బిచ్చగాడు’, ఇంకా పలు అనువాద చిత్రాలకు అద్భుతమైన మాటలు, పాటలు అందించిన భాషాశ్రీ ఈ చిత్రానికి మాటలు, పాటలు రాశారు. ఈ నెల 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

నిర్మాత డి.వి. కృష్ణష్వామి మాట్లాడుతూ ‘‘విజయ్‌ సేతుపతి, జయరామ్‌… భారీ తారాగణంతో సినిమా రూపొందింది. ఇదొక ఫీల్‌ గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌. ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో తెలియదు. సినిమాలో జయరామ్‌ ప్రేమలో పడతారు. ఏజ్‌ ఫ్యాక్టర్‌ వల్ల ప్రేమలో దూరం పెరుగుతుంది. విజయ్‌ సేతుపతి ప్రేమికులను ఎలా కలిపారన్నది కథ. మలయాళంలో రిచ్‌గా తీశారు. సాంగ్స్‌ చాలా బావున్నాయి. పెద్ద సింగర్స్‌తో పాడించాం. భాషాశ్రీగారు అద్భుతంగా రాశారు. డబ్బింగ్‌ సినిమా అనేలా ఉండకూడదని జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రేక్షకులకు స్ట్రయిట్‌ సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఏప్రిల్‌ 23న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు.

వీడియో సందేశం ద్వారా జయరామ్‌ మాట్లాడుతూ ‘‘తెలుగులో పదిహేనేళ్ల క్రితం కమల్‌ హాసన్‌తో కలిసి ‘తెనాలి’, ‘పంచతంత్రం’ సినిమాలు చేశా. ఈ మధ్య కాలంలో అనుష్క ప్రధాన పాత్రలో అశోక్‌ దర్శకత్వం వహించిన ‘భాగమతి’లో, అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ నటించా. మలయాళంలో నేను నటించిన ‘మార్కొని మతాయి’ తెలుగులోకి ‘రేడియో మాధవ్‌’గా వస్తుండటం సంతోషంగా ఉంది. రేడియో మాధవ్‌… బ్యూటిఫుల్‌ ఫిల్మ్‌’’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత ఎన్‌. శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ‘‘ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాను థియేటర్లలో చూస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు.

సమర్పకులు గుండేపూడి శీను మాట్లాడుతూ ‘‘ప్రేమ అనేది గొప్ప ఫీలింగ్‌. చాలా స్వచ్ఛమైనది. ప్రేమకు వయోభేదం లేదని చెప్పే చిత్రమిది’’ అని అన్నారు.

సహ నిర్మాత డి.వి. చలం మాట్లాడుతూ ‘‘మా అబ్బాయి నిర్మాతగా చేస్తున్న చిత్రమిది. డబ్బింగ్‌ సినిమాలా ఉండకూదని ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. చక్కగా డబ్బింగ్‌ చేయించాడు. తెలుగు సినిమా చూస్తున్నట్టే ఉంటుంది’’ అని అన్నారు.

భాషా శ్రీ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రానికి మాటలు, పాటలు రాశా. ‘ఉప్పెనలో ప్రేమికులను విడగొట్టా. ఈ సినిమాలో కలిపా’ విజయ్‌ సేతుపతి అంటున్నారు. సినిమాలోనూ ఆయన హీరోగా కనిపిస్తారు. రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ చేశారు. విజయ్‌ సేతుపతి, జయరామ్‌గారి పాత్రలు బావుంటాయి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని చక్కగా చెప్పారు. ఈ సినిమా చూస్తుంటే నాకు వెంకటేశ్‌గారి సినిమాలు గుర్తొచ్చాయి. అంత బావుంటుంది’’ అని అన్నారు.

విజయ్ సేతుపతి, జయరామ్, ఆత్మీయ రాజన్, పూర్ణ, నరేన్, అజూ వర్గీస్ తదితరులు సినిమాలో నటించారు. ఈ చిత్రానికి సమర్పణ: గుండేపూడి శీను, మాటలు & పాటలు : భాష్య శ్రీ, ఎడిటింగ్‌: షామీర్ ముహమ్మెద్, కెమెరా: సజన్ కలతిల్, సంగీతం: ఏం. జయచంద్రన్, పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ – ఫణి కందుకూరి (Beyond Media), ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎన్. శ్రీనివాస మూర్తి, సహ నిర్మాత: డి.వి . చలం, నిర్మాత: డి.వి . కృష్ణస్వామి, కధ-దర్శకత్వం: సనల్ కలతిల్.