లైఫ్ ఈజ్ ఏ జర్నీ. ముందూ వెనుక, ఇరుపక్కల తోడెందరున్నా -మన ప్రయాణం మనదే. అందరితోనూ ఉంటూనే -తనదైన నడక, నడత, నర్తన సాగించిన అలనాటి పొందికైన నటి -పొట్నూరి సీతాదేవి. బాల్యంనుంచే ముఖానికి రంగేసుకోవడంతో ఏనభై ఐదేళ్లొచ్చినా -ఆమె ఇప్పటికీ బేబీ సీతే! దిగ్గజ దర్శకుడు కెవి రెడ్డి రూపొందించిన ‘యోగి వేమన’ నుంచి పరిశ్రమతో ప్రయాణించిన ఆమె జీవితంలో -ఎన్నో ఆటుపోట్లు. ఎన్నో ఎత్తుపలాలు. ఎనె్నన్నో అనుభవ పాఠాలు. లెక్కలేనన్ని జ్ఞాపకాలు. ఒకతరంతో నటిస్తూ.. నాలుగు తరాలకు ఆదర్శ నటిగా నిలిచిన ఆమె ఈరోజు మరణించారు. ఈ సందర్భంగా సీత దేవి గారి జీవితం ఒకసారి చూద్దాం.
1933 అక్టోబర్ 14న కాకినాడలో రామస్వామి దంపతుల ఒడిలో ప్రత్యక్షమైంది -సీత. బంధువు నీలాబాయి భర్త ఫిల్మ్ మేకర్ రాజా శాండో. అలా ఆమె సీతను కాకినాడ నుంచి మదరాసుకు దత్తపుత్రికగా తీసుకెళ్లారు. బాల్యంనుంచే నృత్యాలపట్ల మక్కువ పెంచుకుని అభ్యాసన మొదలెట్టారు. 1946లో కెవి రెడ్డి తొలిసారి దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ రూపొందించిన ‘యోగి వేమన’లో బాలనటిగా కనిపించారు. అలా సీత -కథానాయిక చెల్లిగా కెవి రెడ్డి మనసులో ఉండిపోయింది. అప్పటి నుంచి ఆయన రూపొందించిన అనేక చిత్రాల్లో సీతకు పాత్ర లేకుండా లేదు. మంచి పాత్రలిస్తూ ప్రోత్సహించారు. హాస్యతారగా సరికొత్త మేనరిజమ్స్‌తో సీత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కెవి రెడ్డి రూపొందించిన మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు తదితర చిత్రాల్లో హాస్యపాత్రలు, చెలికత్తె పాత్రలు ధరించారు. అప్పట్లో హాస్య పాత్రధారిణులు ముగ్గురుండేవారు. వారిలో కనకం, సురభి బాలసరస్వతితో పాటు సీత ఎక్కువ చిత్రాల్లో కనిపించారు. సురభి బాలసరస్వతి, కనకం కొన్ని హాస్యపాత్రలకే పరిమితమైతే, తనలోని నటిని అన్ని రసాల్లో ఆవిష్కరించారు సీత. అలా కామెడీ మెడ్లీకి ఆద్యురాలయ్యారు సీత. షావుకారు చిత్రంలో జోగారావుతో మెడ్లీలో కనిపించి మెప్పించారు. లైలా- మజ్ను, సంసారం, ధిల్లగి చిత్రంలోని పాటలకు పేరడీ చేసి రూపొందించిన ఆ పాట తెలుగు సినీ చరిత్రలో మెడ్లీకి విత్తనంలాంటిది. పక్కనున్న హాస్యనటులను ఫూల్స్‌ను చేయడం, వాళ్లతో ఎకసెక్కాలాడి హాస్యం సృష్టించడం లాంటి పాత్రలు సీతకు వెన్నతో పెట్టిన విద్య. 1940 నుండి ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం, 2002లో ‘నేనేరా పోలీస్’ వరకూ సాగింది. దాదాపు 250 చిత్రాల్లో నటించారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే నటుడు నాగభూషణంతో కలిసి రక్తకన్నీరు, పాపం పండింది, ఇనుప తెరలు, అందరూ బతకాలి లాంటి నాటకాలు దాదాపు 2వేల ప్రదర్శనలిచ్చారు. ముఖ్యంగా నెలలో వారంపాటు వివిధ పట్టణాల్లో రోజుకొక నాటిక ప్రదర్శించేవారు. నాటకరంగం ఒకవైపు, సినిమారంగం మరోవైపు రెండు కళ్లుగా నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. లవంగి, జయసింహ, పల్లెటూరిపిల్ల, గుణసుందరి కథ, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి, భానుమతి నటించిన గృహప్రవేశం, సతీతులసి, అత్తా ఒకింటి కోడలే, ఋష్యశృంగ, సత్యహరిశ్చంద్ర, సంతోషిమాతవ్రతం, దేవదాసు,మాయాబజార్ వంటి గొప్ప చిత్రాల్లోనటించి తన ప్రతిభ చాటారు. టీవీలో తొలి సీరియల్ ఋతురాగాల్లోనూ నటించి, తరువాత అనేక చానల్స్‌లో ధారావాహికలలో నటించి పేరు తెచ్చుకున్నారు. రక్తకన్నీరు నాటకం అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రదర్శించే సమయంలో నటుడు నాగభూషణాన్ని 1956లో వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక దాదాపు కుటుంబానికే పరిమితమయ్యారు. కూతురు భువనేశ్వరి, కొడుకు సరేందర్. పక్కింటి అమ్మాయి చిత్రంలో అంజలి స్నేహితురాలిగా నటించారు. పాఠాలు చెప్పడానికి వచ్చిన హాస్యనటుడు అడ్డాల నారాయణరావును ఆటపట్టిస్తూ ఓ పాట పాడుతూ చేసిన నృత్యం ఆ సినిమాకి ప్రత్యేక గీతంగా నిలిచింది. భలేరాముడు చిత్రంలో రేలంగితో చేసిన ‘బంగరు బొమ్మా భలే జోరుగా పదవే పోదాం పైదేశం చూద్దాం’ పాట అప్పట్లో సూపర్‌హిట్. ముఖ్యంగా దర్శకుడు తిలక్ ‘అత్తా ఒకింటి కోడలే’ చిత్రంలో చెదలవాడ కుటుంబరావు, సీతలతో చేసిన పాట ‘తడికో తడిక’ ఇప్పటికీ వినిపిస్తూనే వుంటుంది. నాగేశ్వరరావు- జమున ప్రధాన తారాగణంగా కెవి రెడ్డి ‘పెళ్లినాటి ప్రమాణాలు’ చిత్రం రూపొందిస్తున్నారు. ఆ చిత్రంలో ఏఎన్నార్ రాజసులోచన ప్రేమలో పడతాడు. అది ఇష్టంలేని రాజసులోచన హీరోపై సీతను ప్రయోగిస్తుంది. సీత ఓ పిచ్చి అమ్మాయిలా వచ్చి ఏఎన్నార్‌ను హడలిగొట్టి బయటకు పంపిస్తుంది. కమెడియన్లపై ప్రయోగించే కలకంఠి నటన హీరోపై కూడా ప్రయోగించమంటారా? అంటూ సెట్లో కెవి రెడ్డిని అడిగారట సీత. అదే సన్నివేశంలో ఓ డైలాగ్ కూడా వుంటుంది. అచ్చం హీరో నాగేశ్వరరావులాగా ఉన్నావే అన్నదే ఆ డైలాగ్. అదే డైలాగ్ సావిత్రి కెరీర్ తొలి చిత్రం ‘సంసారం’లోనూ వినిపిస్తుంది. అప్పుడు ఆ చిత్రంలో సావిత్రి అంటే, ఈ చిత్రంలో సీత అంటారు అదే డైలాగ్‌ను. ఈ విషయాన్ని కూడా కెవి రెడ్డి ప్రత్యేకంగా చెప్పి సీతచేత ఆ పాత్రను చేయించడం విశేషం. నాటకాలు వేసే సమయంలో నాటక సమాజంతో కలిసి అనేక ఊళ్లు తిరిగేవారు. ఓసారి ముమ్మిడివరంలో నాటకం ప్రదర్శించాలి. కానీ నాటకం వేయిస్తున్న కాంట్రాక్టర్‌కు ఊళ్లో కొంతమందికి గొడవలు జరగడంతో నాటకం రద్దుచేశారు. ఆ రాత్రి భోరున వాన. నాటకం వేయాల్సిన థియేటర్వద్ద ఏం జరుగుతుందో చూద్దామని నటుడు నాగభూషణం బయలుదేరారు తమ బసనుండి. ఆయనతోపాటుగా నాటకం ప్రదర్శించే నటులు మామ సత్యం మరికొందరు బయలుదేరారు. వారితోపాటుగా సీతకూడా బయలుదేరింది. అక్కడికెందుకు, గొడవలు జరుగుతున్నాయి, నువ్వు రావద్దు అంటూ వారించారు నాగభూషణం. అయినాకానీ ఆమె పట్టువీడలేదు. ఫాంటు, షర్టు తగిలించుకొని తలపాగా చుట్టుకొని ఓ సిగరెట్ చేతిలో పెట్టుకుని వారితోపాటు వెళ్లారు. థియేటర్ వద్ద ఆమెను ఎవ్వరూ గుర్తుపట్టలేదు. అక్కడికివెళ్లి గొడవ సర్దుబాటుచేసి వచ్చారు. మొత్తానికి అక్కడికి ధైర్యంగా వచ్చినందుకు నాగభూషణం మెచ్చుకున్నారు. హిందీలో రూపొందించిన ‘అల్బేలా’ చిత్రాన్ని నాగభూషణం తెలుగులో నాటకాల రాయుడుగా రూపొందించారు. ఆ చిత్రంలో ఆయన వదిన పాత్రలో విషాద ఛాయలు పలికిస్తూ ఆమె చేసిన నటన అందరినీ కదిలించింది. ఓ హాస్యనటి జీవితంలో ఓ విలక్షణమైన పాత్రగా అందరూ అభివర్ణించారు. పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యాక తనకు వీలు వున్ననాళ్లు సినిమాల్లో నటించేవారు. సినిమా పరిశ్రమలో ఉన్న అనేకమంది, బంధువులకు కష్టాలను విని గుప్తాదానాలు ఎన్నో చేశారు. ఇటీవల యువకళావాహిని రేలంగితో అనేక హాస్య పాత్రల్లో నటించిన సీతను గుర్తించి, ఆమెకు రేలంగి పురస్కారం ప్రదానం చేశారు. ఆ సభలో ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రేలంగితో నటించి ఆయన అవార్డు అందుకోవడం ఓ పెద్ద అవార్డుగా తాను భావిస్తున్నానని, తనను ఆదరించిన అనేకమంది దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతున్నానని అంటారామె.
87 సంవత్సరాల సీతాదేవి ఈరోజు ఆమె ఇంట్లోనే మరణించారు. కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు కూడా ముగిశాయి. ఎన్టీఆర్ ఎఎన్నార్ సావిత్రి లాంటి గొప్ప నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న సీతదేవి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు లాంటింది.