హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సెట్లో యూనిట్ సభ్యులకు వార్నింగ్ ఇచ్చిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా యూనిట్ సభ్యులు ఈ వీడియోను లీక్ చేసినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ‘మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ 7’ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం శరవేగంగా దీని షూటింగ్ జరుగుతుండగా.. ఈ సందర్భంగా సెట్లో సినిమా యూనిట్ సభ్యులపై టామ్ క్రూజ్ సీరియస్ అయ్యాడు.
సెట్లోని సభ్యులు కరోనా నిబంధనలు పాటించకపోవడంపై టామ్ క్రూజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. లాక్‌డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీ కోట్లలో నష్టపోయిందని, చాలా మంది రోడ్డు మీద పడ్డారని ఈ వీడియోలో టామ్ క్రూజ్ అన్నట్లు ఉంది. ‘మనం టైమ్‌కి తిండి తినగలుగుతున్నాం. అది గుర్తు పెట్టుకుని పనిచెయ్యండి. నేను ఎప్పుడూ రెస్పాన్సిబుల్‌గా ఉంటాను. నా టీమ్ కూడా అలా బాధ్యతతో ఉండాలనే అనుకుంటాను.. రెస్పాన్సిబుల్‌గా పనిచేసే వాళ్లనే పనిలోకి తీసుకుంటాను. పని విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని నేను సహించను. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే.. ఉద్యోగాలు పీకేస్తాను’ అంటూ క్లాస్ పీకాడు.
కాగా ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా టామ్ క్రూజ్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే లాక్‌డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోవడంతో చాలా నష్టం జరిగింది. ఇప్పుడు మళ్లీ సెట్లో ఎవరికైనా కరోనా వస్తే షూటింగ్ ఆగిపోయి నష్టం జరిగే అవకాశముంది. అందుకనే యూనిట్ సభ్యులపై టామ్ క్రూజ్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది,