ఆధునిక కుటుంబ వ్యవస్థలో అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. ఆస్తి పంపకాలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ కాలంలో ఆస్తి సంపాదించినా కష్టమే ! సంపాదించకపోయినా కష్టమే ! ఎందుకంటే ఆస్తి కూడబెట్టకపోతే పిల్లల దృష్టిలో చేతకాని తండ్రిగా ముద్రవేసుకోవాల్సి వస్తుంది. ఆస్తి సంపాదిస్తే దాన్ని సంతానానికి పంపకం చేయడంలో సంకటం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాగైనా ఈ కాలం తల్లిదండ్రులకు ఇదో పెద్ద చిక్కు సమస్య. తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో చూసుకోవడానికి ముందుకురాని పిల్లలు ఆస్తి అనగానే యుద్ధానికి సిద్ధమవుతారు. సరిగ్గా ఇదే కథాంశంతో రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్ర పోషించిన తోలుబొమ్మలాట మోషన్ పోస్టర్ సొషల్ మీడియాలో చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ ఎంతో ఆకట్టుకుంటోంది.
మూవీలో రాజేంద్రప్రసాద్ రాసిన వీలునామా వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పోస్టర్లో తరాజులో ఆస్తిని తూకం వేసే సీన్ ఆకర్షణీయంగా ఉంది. మోషన్ పోస్టర్ ప్రకారం రాజేంద్రప్రసాద్ చెప్పిన డైలాగులు ఆసక్తి రేపుతున్నాయి. నేను నా పిల్లలకు ఇచ్చిన మాటతో సంతోషంగా ఉన్నానని మనస్పూర్తిగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నాను..పూర్తి ఆరోగ్యంతో, మనస్పూర్తిగా నా స్వహస్తాలతో రాస్తున్న వీలునామా ఇది..అని రాజేంద్రప్రసాద్ చెబుతున్నాడు. కుటుంబ ఆస్తి తగాదాల నేపద్యంలో వీలునామా రాసినట్లు దీని ద్వారా తెలుస్తోంది. మోషన్ పోస్టర్ లో వినిపించిన డైలాగ్స్, మ్యూజిక్ బాగున్నాయి. కేవలం మోషన్ పోస్టర్ తోనే తోలుబొమ్మలాట సినిమా ఆ నలుగురు చిత్రాన్ని గుర్తు చేసింది. విశ్వనాధ్ మాగంటి దర్శకత్వంలో రూపొందిన తోలుబొమ్మలాట మూవీని దుర్గాప్రసాద్ మాగంటి నిర్మిస్తున్నారు.