నీకు టన్ను ధన్యవాదాలు బ్రో.. మహేష్‌కి సూర్య రిప్లై

తమిళ హీరో సూర్య హీరోగా తెలుగు దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆథారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య నటన అద్భుతమని చెప్పవచ్చు. ఇందులో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా బాగా నటించాడు.

ఈ సినిమాకు సెలబ్రెటీల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ‘ఆకాశం నీ హద్దురా సినిమా’ చాలా స్పూర్తిదాయకంగా ఉందని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసించాడు. డైరెక్షన్ చాలా బాగుందని, సూర్య నటన ఒక రేంజ్‌లో ఉందన్నాడు. టీమ్ మొత్తానికి మహేష్ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపాడు.

మహేష్ ట్వీట్‌కు తమిళ స్టార్ హీరో సూర్య రిప్లై ఇచ్చాడు. ‘చాలా దయగల సోదరుడు.. నీకు ఒక టన్ను ధన్యవాదాలు. త్వరలో ప్రారంభించనున్న సర్కారు వారి పాట సినిమాని వీక్షించేందుకు తాను ఆసక్తిగా వేచి చూస్తున్నా’ సూర్య రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది.