ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్న వేళ, ఇద్దరు హీరోలు మాత్రమే తెలుగు సినిమాని శాసిస్తున్న వేళ… ప్రేక్షకులకి పరిచయం అయిన కొత్త ముఖం శివరామకృష్ణమూర్తి. అదేంటి ఈ పేరు ఎప్పుడూ వినలేదే, ఎవరా హీరో అనుకుంటున్నారా? ఘట్టమనేని ఆయన ఇంటి పేరు సాహసం ఆయన ఒంటి పేరు. ది న్యూ హీరో బోర్న్ ఈజ్ కృష్ణ, కాదు కాదు సూపర్ స్టార్ కృష్ణ. అప్పటివరకూ ఎన్టీవోడు, ఏఎన్నార్ అని మాత్రమే సినీ అభిమానులు పిలుచుకునే చోట, సూపర్ స్టార్ అనే పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో కృష్ణ. సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ అని బిరుదు అందుకున్న మొదటి హీరో ఆయనే. పగలు రాత్రి అనే తేడా లేకుండా రోజుకి మూడు పూటలు ఉన్నట్లే రోజుని మూడు షిఫ్టులుగా విభజించి మూడు వేరు వేరు సినిమాల షూటింగ్ చేసిన ఘనుడు కృష్ణ. మే 31న ఆయన జన్మదినం సందర్భంగా స్పెషల్ ఆర్టికల్. ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి (తండ్రి)
ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి నాగరత్నమ్మలకి 1942 మే 31 బుర్రిపాలెంలో పుట్టిన శివరామకృష్ణ మూర్తి. ఈ శివరామకృష్ణమూర్తిని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా మార్చాడు. ఆరు అడుగుల ఎత్తు, రాజఠీవి ఉన్న దేహం ఉన్న ఈ కృష్ణనే భవిషత్తులో తెలుగు సినిమాకి సూపర్ స్టార్ అవుతాడని ఆరోజు ఎవరూ ఊహించి ఉండరు. కృష్ణ డిగ్రీ చదువుతూండగా ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. అది కళ్లారా చూసిన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నాడని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలన్న కల కన్నాడు. డిగ్రీ పూర్తై, ఇంజనీరింగ్ సీటు రాకపోవడంతో అప్పటికే సినిమాల్లో హీరో కావాలని ఆశిస్తున్న తండ్రి అనుమతి తీసుకుని సినిమా ప్రయత్నాలు చేశాడు. కృష్ణ ఇష్టాన్ని అనుసరించి అతని తండ్రి రాఘవయ్య చౌదరి తనకు తెలిసిన సినిమా వారికి పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసిచ్చి మద్రాసు పంపాడు. కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, చక్రపాణి లాంటి ప్రముఖులు తెనాలి వారే కావడంతో చెన్నై వెళ్లిన కృష్ణ వారిని కలిసి తన ఇష్టాన్ని తెలియజేశాడు. అప్పటికి కృష్ణ వయసు రీత్యా చిన్నవాడు కావడంతో, కొంతకాలం ఆగి మద్రాసుకు తిరిగిరమ్మని వారు సలహా ఇచ్చారు. దాంతో కృష్ణ నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నించాడు. శోభన్ బాబుతో కలిసి మొదటి నాటకం చెన్నైలోనే వేసిన కృష్ణని, ఎల్వీ ప్రసాద్ తీస్తున్న కొడుకులు కోడళ్ళు అన్న సినిమాలో ఒక పాత్రకు ఎంపికచేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మద్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి నటన ప్రాక్టీసు చేయమని స్నేహితులు సలహా ఇస్తే వేషాల కోసం కష్టాలు పడడం ఏమిటి? అదృష్టం ఉంటే వేషాలే వెతుక్కుంటూ వస్తాయని కొట్టిపారేసేవాడు. రోజూ సెకండ్ షో సినిమాలు చూస్తూ, పగలు సినిమాల్లో వేషాల కోసం తెలిసినవారిని కలుస్తూ ప్రయత్నాలు చేశాడు. కొంగర జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. అదే తెరపైన శివరామకృష్ణ కనిపించిన మొదటి సినిమా. ఇక్కడి నుంచి కులగోత్రాలు, పరువు ప్రతిష్ఠ, మురళీకృష్ణ సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. నటుడిగా అక్కడక్కడా కనిపిస్తున్నాడు కానీ పూర్తి స్థాయి హీరో అవకాశం మాత్రం రాలేదు. ఈ సమయంలో కాదలిక్క నేరమిల్లై అన్న తమిళ సినిమా కోసం దర్శక నిర్మాత సి.వి.శ్రీధర్ కొత్త నటులను వెతుకుతూ కృష్ణను కథానాయకుడిగా ఎంపిక చేశాడు. అయితే కృష్ణకు తమిళం రాకపోవడంతో అవకాశం పోయింది. హీరోగా వచ్చిన మొదటి అవకాశం పోవడంతో శివరామకృష్ణ తెనాలి వెళ్ళిపోయాడు. తిరిగి చెన్నై వచ్చి సినీ ప్రపంచాన్ని పాలించే రోజు దెగ్గరలోనే ఉందని ఆయనకి తెలియదు.
ఈ సినీ ప్రపంచాన్ని పాలించే రోజు… పేపర్ యాడ్ రూపంలో వచ్చింది. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తాను తీస్తున్న తేనె మనసులు కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ తెనాలి నుంచి తన ఫోటోలు పంపించాడు. కృష్ణ హీరోగా ఎంపికైన తర్వాత అతనికి సంభాషణలు చెప్పడం, డ్యాన్స్ చేయడం వంటి పలు అంశాల్లో శిక్షణనిచ్చారు. ఈ సమయంలోనే ఆయన పేరుని శివరామకృష్ణ మూర్తి నుంచి కృష్ణగా మారింది. మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే ఆదుర్తి తీయబోయే మరో సినిమాలో కూడా నటించే ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలి తెలుగు సాంఘిక కలర్ చిత్రంగా తేనే మనసులు సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సినిమా రషెస్ చూసిన పంపిణీదారులు కృష్ణ నటన బాగాలేదని తొలగించెయ్యమని ఒత్తిడి తెచ్చినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు. ఆయన దృఢ సంకల్పమమే నిజమయ్యి తేనే మనసులు సినిమా హిట్ అయ్యింది. హీరోగా రెండో సినిమా కన్నె మనస్సుల్లో సినిమా నటిస్తున్న సమయంలోనే గూఢచారి 116 సినిమాలో హీరోగా కృష్ణకు అవకాశం వచ్చింది. తేనెమనసులు సినిమాలో స్కూటర్‌తో కారును ఛేజ్ చేస్తూ, స్కూటర్‌ను వదిలేసి కారు మీదికి జంప్ చేసే సన్నివేశం ఉంది. ఈ సీన్ లో డూప్ లేకుండా కృష్ణ ఆ సన్నివేశంలో నటించిన సంగతి తెలుసుకున్న నిర్మాత డూండీ జేమ్స్‌బాండ్ చిత్రానికి కృష్ణని హీరోగా ఎంపికచేశాడు. గూఢచారి 116, జేమ్స్ బాండ్ సినిమాలూ దాదాపు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకుని, రెండూ 1966లోనే విడదలయ్యాయి. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించింది. కృష్ణ కెరీర్ ని మలుపుతిప్పిన రోజు అది. ఒక కొత్త రకం సినిమాని, ఒక ఉత్తేజం ఉన్న హీరోని తెలుగు ప్రజలు చూసింది ఆరోజే. దీంతో ప్రేక్షకులు కృష్ణని ఆంధ్రా జేమ్స్‌బాండ్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. జేమ్స్ బాండ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాలు సైన్ చేశాడు. ఏ హీరో టచ్ చేయని జానర్ లో 2 దశాబ్దాల్లో మరో 6 జేమ్స్ బాండ్ చిత్రాలు చేసిన కృష్ణ ఎన్నో హిట్స్ ఇచ్చారు. తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న కృష్ణ ఒకానొక సమయంలో “ఎవరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నానో చూసుకునే తీరిక కూడా ఉండేది” కాదని కృష్ణ ఓపెన్ గానే చెప్పాడు అంటే ఆయన ఎంత బిజీ అనేది అర్ధం చేసుకోవచ్చు. అయిదు దశాబ్దాల పాటు దాదాపు 350 సినిమాలు చేసిన కృష్ణ 1972లో 18 సినిమాలు చేసి రికార్డు నెలకొలిపాడు. దాదాపు 39 ఏళ్లు గడుస్తున్నా ఈరోజుకి ఈ రికార్డు చెక్కు చెదరలేదు. మూడు షిఫ్టులు పనిచేసేవాడు.
కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం అయింది. 1967లో బాపు-రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో కృష్ణ కథానాయకుడిగా, విజయనిర్మల కథానాయకిగా నటించింది. సర్కార్ ఎక్స్‌ప్రెస్ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ విజయనిర్మలను ప్రేమిస్తున్నానని పెళ్ళిచేసుకుంటానని చెప్పాడు. పరస్పర అంగీకారంతో మరో రెండేళ్ళకు 1969లో తిరుపతిలో పెళ్ళిచేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణ విజయనిర్మల కాంబినేషన్ లో 47 సినిమాలు వచ్చాయి. ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక హీరో హీరోయిన్ కలిసి ఇన్ని చేయడం ఇదే మొదటిసారి చివరి సారి కూడా. వరసగా సినిమాలు చేస్తున్న కృష్ణకి భార్య పిల్లలతో కూడా టైం గడిపే సమయం ఉండేది కాదు. ఉదయం, మధ్యాహ్నం మాత్రమే కాక మూడవ షిఫ్ట్ రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఉండేది. చివరికి నిద్రపోతున్న సమయంలో కాస్ట్యూమ్స్ వేసుకుని పడుకుంటే నిద్రిస్తున్న సన్నివేశాలు చిత్రీకరించుకున్న సందర్భాలు ఉన్నాయి. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా 1974లో పద్మాలయ స్టూడిస్ నుంచి వచ్చిన అల్లూరి సీతరామరాజు ఒక సంచలనం. కృష్ణ మన్యం వీరుడిగా కనిపించిన ఈ సినిమా, తెలుగులో ఫుల్‌స్కోప్ సినిమాల్లో మొదటిది. బాక్సాఫీస్ రికార్డుల పరంగా చూస్తే, హైదరాబాద్ నగరంలో ఏడాది పాటు ఆడిన తొలి తెలుగు సినిమాగా అల్లూరి సీతారామరాజు నిలిచిపోయాయి. 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ “నటశేఖర” బిరుదును అందుకున్నాడు. ప్రధానంగా 1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున తెలుగు తమిళ హిందీ ఇతర భాషలతో కలిపి దాదాపు 300 సినిమాలు పూర్తిచేశాడు. 1980ల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా కృష్ణ నిలబడ్డాడు. ఎన్.టి.రామారావు తర్వాత అంతటి స్థానాన్ని సాధించింది ఆయనే. ఏ ప్రజాదరణను ఆశించి సినిమా రంగంలోకి వచ్చాడో దాన్ని పూర్తిగా అనుభవించాడు. 1989 నాటికే 274 సినిమాలు పూర్తిచేసుకున్న కృష్ణ 90వ దశకంలో తన శైలికి భిన్నంగా కేవలం 44 సినిమాలే చేయగలిగాడు. నటశేఖరుడు తన సినీ జీవితంలో తొలిసారి గ్యాప్ తీసుకున్నదీ ఈ సమయంలోనే. దర్శకుడిగానూ 16 సినిమాలు తీసిన కృష్ణ, పద్మాలయ స్టూడియో బ్యానర్ పై అన్ని భాషల్లో కలిపి 47 సినిమాలని నిర్మించారు.
తాను నటించిన సినిమాల ఫలితం ఏమవుతుందో తెలుసుకోవడానికి విడుదలయ్యాకా విజయవాడ వచ్చి సినిమా చూసి ప్రేక్షకుల స్పందన ఎప్పటికప్పుడు అంచనా వేసుకునే కృష్ణ గారు తెలుగు సినీ రంగాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్ళే విషయాల్లో మొట్టమొదటి అడుగులెన్నో వేశాడు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ చిత్రం, తొలి కౌబాయ్ చిత్రం ఆయన నటించినవే. ఇక సాంతకేతికంగానూ పలు తొలి తెలుగు సినిమాలు కృష్ణవే. కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్.ఓ. సాంకేతికత పరిచయం చేశాడు. మొదటి ఓఆర్‌డబ్ల్యు కలర్ సాంకేతికతతో తీసిన సినిమా గూడుపుఠాణి. తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం భలే దొంగలు. తెలుగులో 70 ఎంఎం సాంకేతికత ఉపయోగించిన తొలి సినిమా సింహాసనం. సింహాసనం సినిమా స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సాంకేతికతతో సౌండ్ టెక్నాలజీ వాడిన తొలి తెలుగు సినిమా. కొత్త జాన్రాలు, సాంకేతికాంశాలు ప్రవేశపెట్టడంతో పాటు రిస్క్ తీసుకుని దెబ్బలు తినైనా ఫైట్ సీన్లు పండించడం వల్ల కృష్ణను డాషింగ్ అండ్ డేరింగ్ హీరో అని పిలిచేవారు.
సినిమా వ్యాపారంలో స్టూడియో అధినేత, నిర్మాత, పంపిణీదారు, ఎగ్జిబిటర్ వంటి అన్ని దశల్లోనూ కృష్ణ స్వంతంగానూ, భాగస్వామ్యంలోనూ వ్యాపారాలు చేసి అనుభవం గడించాడు. స్వయానా తనకు పెద్ద ఇమేజ్, భారీ సంఖ్యలో అభిమానుల బలం ఉన్నా కృష్ణ మొదటి నుంచీ కెరీర్ తుది వరకూ ఇతర పెద్ద హీరోలతో మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నుంచి అప్పటికి హీరోలుగా చేస్తున్న చాలా మంది హీరోలతో కృష్ణ మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. ఎక్కువ మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోగానూ కృష్ణకు ప్రత్యేకత ఉంది. కృష్ణ వ్యక్తిగతంగా మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా పేరుతెచ్చుకున్నాడు. క్లుప్తంగా, ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవాడు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మొహమాటంగా ఆ సంగతి అంగీకరించేవాడు. సినిమా రంగంలో సాధారణంగా సినిమా ఫ్లాప్ అయితే హీరోలు “బాగా లేదని అంటున్నారండీ, కానీ వచ్చే వారం పికప్ అవుతుంది” అంటూ చెప్తూంటారని, కృష్ణ మాత్రం మన సినిమా చీదేసిందని నవ్వుతూ చెప్పేవాడట. తన బలాలతో పాటు లోపాలపైనా, తనకున్న పరిమితులపైనా కూడా చక్కని అవగాహన ఉండేది. కృష్ణ కొత్త నిర్మాతలకు డేట్స్ ఇచ్చి సినిమాలు చేసి వారికి పరిశ్రమలోకి రావడానికి మార్గంగా ఉండేవాడు. తనతో సినిమా తీసి నిర్మాత ఆర్థికంగా నష్టపోయినప్పుడు తానే నిర్మాత వద్దకు వెళ్ళి వాళ్ళు దెబ్బతినకుండా ఉండేందుకు వెంటనే మంచి సినిమా ప్లాన్ చేయమని, అడ్వాన్స్ అక్కర్లేదని డేట్లు ఇచ్చేవాడు. విడుదలకు ముందు నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే తన పారితోషికం వదులుకునేవాడు “హీరోగా అతను పైకి రావడానికి మంచితనం కూడా ఒక కారణం” అని కైకాల సత్యనారాయణ లాంటి పెద్దలు అన్నారంటే కృష్ణ గారి స్వభావం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కృష్ణ సినిమాల్లో నటించిన రెండో కొడుకు మహేశ్ బాబు 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. కృష్ణ నటవారసుడిగా కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు, సూపర్ స్టార్ స్థాయికి ఎదిగాడు. ఇండస్ట్రీ హిట్స్ ఇస్తున్న మహేశ్ టాలీవుడ్ టాప్ హీరోగా నిలబడ్డాడు అయితే కృష్ణ శైలికి భిన్నంగా మహేష్ చాలా నిదానంగా, గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. సినిమాకే వేగం నేర్పించిన సూపర్ స్టార్ కృష్ణకి 78వ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ, ఈరోజు ఘట్టమనేని అభిమానుల కోసం వచ్చే స్పెషల్ న్యూస్ కోసం వెయిట్ చేద్దాం.