పవన్ రీఎంట్రీ.. అసలు విషయం బయటపెట్టిన శృతి

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, శృతిహాసన్ కలిసి గతంలో రెండు సినిమాలు చేయగా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్.. తిరిగి ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘పింక్’ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తవ్వగా.. సంక్రాంతికి విడుదలయ్యే అవకాశముంది.

pawankalyan

ఇందులో అంజలి, నివేదా థామస్, అనన్యతో పాటు శృతిహాసన్ నటిస్తోంది. త్వరలోనే తాను వకీల్ సాబ్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని, తన పాత్ర ఏంటనేది ఇప్పుడే చెప్పలేనని శృతి తెలిపింది. పవన్ కల్యాణ్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఈ సినిమాలో తాను కూడా భాగస్వామ్యం అవుతుండటం హ్యాపీగా ఉన్నానని చెప్పింది. మూడోసారి పవన్‌తో నటిస్తున్నందుకు సంతోషంగా ఉన్నానంది.

వకీల్ సాబ్ సినిమాలో పవన్ న్యాయవాది పాత్రను పోషిస్తుండగా.. ఇందులో పవన్ భార్యగా శృతిహాసన్ నటించనుందని సమాచారం. ఇందులో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషించనున్నాడు. ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండింగ్‌ అయ్యాయో మనకు తెలిసిందే.