నాని… అందుకే నేచురల్ స్టార్ అయ్యాడు

ఎక్కడో జిల్లాల్లో రైటర్ అవ్వాలనుకున్న ఒక కుర్రాడు ఒక ప్రేమ కథని రాస్తున్నాడు… హీరో నాని. కృష్ణ నగర్ వీధుల్లో తిరుగుతున్న ఒక కుర్రాడు, ఒక మిడిల్ క్లాస్ బాబు జీవితాన్ని కథగా చెప్పాలనుకుంటున్నాడు… హీరో నాని. ప్రేమ, స్నేహం, కుటుంబం ఈ బంధాలన్నీ కలిపి రాసిన కథతో ఒక అబ్బాయి ప్రొడక్షన్ హౌసుల చుట్టూ తిరుగుతున్నాడు… హీరో నాని. ఏంటి? అన్ని కథల్లో నానినే హీరో ఎలా అవుతాడు అనుకుంటున్నారా. అవును, ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న నానిని దృష్టిలో పెట్టుకోని పుడుతున్న కథలెన్నో. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని, ఆ తర్వాత న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. పైన చెప్పిన ప్రతి కథలో ఇమడగలిగిన నటుడు నాని, అందుకు నాని ఇప్పుడు స్టార్. ఏ అండా లేకుండా ఇండస్ట్రీలో రాణించాలి అనుకునే ప్రతి ఒక్కరికీ నాని నిజంగా ఒక స్టార్… ఈ స్టార్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి 11 ఏళ్లు అయ్యింది, ఈ సంధర్భంగా నాని గురించి ఒక స్పెషల్ స్టోరీ మీకోసం… ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు కానీ ప్రతి హీరో అభిమాని నానికి సినిమాలకి ఫ్యాన్ అవుతాడు, అతని సినిమా వస్తుంది అంటే టాక్ తో సంబంధం లేకుండా ఆ సినిమా చూస్తాడు. అసలు నాని మనకి ఎందుకు ఇష్టం? ఈ పదకొండేళ్లలో నాని సాధించింది ఏంటి? ఈ విశేషాలతో ఉన్న ఆర్టికల్ పై మీరూ ఒక లుక్కేయండి…

ఏ సినిమాకి అయినా హీరో అనే వాడు ఫేస్ ఆఫ్ ది ఫిలిం అవుతాడు. అందుకే సినిమాల్లో హీరో చనిపోయినా, ఓడిపోయినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులైతే హీరో చనిపోతాడు అని తెలిస్తే, ఆ పర్టిక్యులర్ మూవీని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. హీరో ఓడిపోతారు అని తెలిసినా, హీరో హీరోయిన్ కలవరని పించినా… మన ప్రేక్షకులు ఆ సినిమాలు చూడరు. ఎప్పుడో అమావాస్య పుణ్యానికి నెగటివ్ ఎండింగ్ ఉన్న సినిమాలు ఆడినా కూడా సినీ చరిత్రంతా చూస్తే మాత్రం నెగటివ్ ఎండింగ్ ఉన్న సినిమాలు మన దెగ్గర ఆడవు. ఇది నిజం, ఇదే నిజం. అయితే అష్టాచమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుర్రాడు మాత్రం టాలీవుడ్ హిస్టరీని తిరగరాస్తూ కొత్త పంథాలో సాగుతున్నాడు. హీరో అనే పదానికి కొత్త అర్ధం చెప్తూ బాక్సాఫీస్ దగ్గర హిట్స్ అందుకుంటున్నాడు. ఇప్పటి వరకూ 23 సినిమాలు చేసిన నాని, రీసెంట్ గా జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. నాని చనిపోయినా ప్రేక్షకులు ఆ సినిమాని సూపర్ హిట్ చేశారు. ఆడియన్స్ నానిని ఇలా యాక్సెప్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు… ఇంకా సింపుల్ గా చెప్పాలి ఆంటే సాడ్ స్టోరీస్ అండ్ నాని.. ఏ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ.

తన జట్టు గెలుపు కోసం ప్రయత్నిస్తూ నాని చనిపోతే అది భీమిలి కబడ్డీ జట్టు అయ్యింది, చనిపోతానని ప్రయత్నించినా అది జెర్సీ సినిమా అయ్యింది. చనిపోయాక ప్రయత్నిస్తే అది ఈగ మూవీ అయ్యింది, పక్కన వాడు చనిపోయాక ప్రయత్నిస్తే అది ఎవడే సుబ్రహ్మణ్యం అయ్యింది. మరణంతో ముడిపడిన ఈ ప్రతి సినిమా, నానిని నటుడిగా మరోస్థాయికి తీసుకెళ్లాయి. నాచురల్ స్టార్ గా నానిని ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇలాంటి సినిమాలతో హిట్ అందుకున్న నాని, హీరో చనిపోతే ప్రేక్షకులు చూడరు అనే ఫీలింగ్ ని తుడి చేశాడు. ఇది మాత్రమే కాకుండా లవ్ స్టోరీస్ లో కూడా నిన్ను కోరి లాంటి డిఫరెంట్ మూవీ చేసి, సరైన కారణం… బలమైన కథాకథనం ఉంటే హీరో హీరోయిన్ విడిపోయినా ప్రేక్షకులు చూస్తారు అనే నమ్మకం కలిగించాడు. ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు చేస్తున్నాడు కాబట్టే నాని మనకి నచ్చుతాడు, సినిమాలో విషయం ఉంటే దాని రిజల్ట్ ప్రేక్షకులే నిర్ణయిస్తారు అనే నమ్మకం కలిగించాడు. సినిమా సినిమాకి ఫాలోయింగ్ పెంచుకుంటున్న నాని, ఈ పదకొండేళ్లలో ఎంత మంది అభిమానులని సంపాదించుకున్నాడు, నాని సినిమా ఫ్లాప్ అయ్యి ఎంత కాలం అయ్యిందంటే టక్కున చెప్పడం కష్టం. అందుకే నాని నుంచి సినిమా వస్తుంది అంటే తప్పకుండా చూడాలి అనే నమ్మకం ప్రతి ప్రేక్షకుడిలో ఉంది, నానితో సినిమా చేస్తే అంత ఈజీగా నష్టపోమనే నమ్మకాన్ని నిర్మాతలకీ కలిగించాడు. 11 ఏళ్లలో ఇంత సాధించిన నాని, ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీతో నాని మరో హిట్ అందుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది. ఫ్యూచర్ లో కూడా మంచి సినిమాలు చేసి నాని ప్రేక్షకులని అలరిస్తూనే ఉండాలి.