ఇటీవల బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) సోనూసూద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జూహూ ప్రాంతంలో ఉన్న సోనూసూద్ 6అంతస్తుల భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. ఈ నేపథ్యంలో సోనూసూద్ బీఎంసీ తీరుపై హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది.
అయితే బుధవారం ఉదయం ముంబైలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌పవార్‌తో సోనూసూద్ భేటి అయ్యారు. శరద్‌పవార్ నివాసంలో వీరిద్దరు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో శరద్‌పవార్‌ను సోనూసూద్ ఎందుకు కలిశాడన్న దానిపై సినీ ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతుంది. అలాగే అభిమానులు కూడా సోనూ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడా? ఇలా రకరకాలుగా ఊహించుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో శరద్‌పవార్‌తో కేవలం మర్యాదపూర్వకంగానే కలిసినట్లు సోనూసూద్ తెలిపాడు. ఇదిలా ఉంటే కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు, రైతులు, విద్యార్థులను ఆదుకున్నాడు సోనూసూద్. అలాగే సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కూడా తన వంతుగా సాయం చేస్తున్నారు. అందుకే తనని రియల్ హీరోగా దేశవ్యాప్తంగా అభివర్ణిస్తారు. దేశంలో మీ లాంటి రియల్హీరోలు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.