ప్రముఖ నటుడు సోనూసూద్ ఎక్కువగా విలన్ రోల్స్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అయితే రీల్ లైఫ్‌లో విలన్ రోల్ పోషించే సోనూసూద్ రియల్‌లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. కరోనా లాక్డౌన్ వేళ కార్మికులకు సోనూసూద్ చేసిన సాయాన్ని ఎవ్వరూ అంత సులువుగా మర్చిపోరు. ఇంకా చెప్పాలంటే చాలా మంది పాలిట ఓ దేవుడిలా మారాడు సోనూసూద్. ఈ క్రమంలో ఆయన చేత సాయం పొందిన నిరుపేదలు, తమ షాపులకు సోనూసూద్ పేరు కలిసేలా పెట్టుకున్నారు.
ఇక తాజాగా సోనూసూద్ ట్యాంక్‌బండ్‌ను సందర్శించిన ఆయన ట్యాంక్ బండ్ శివను అభినందించారు సోనూ. ప్రమాదవశాత్తు మరణించి, ఆత్మహత్యలు చేసుకున్న వారి మృతదేహాలను వెలికితీస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిన శవాల శివను సోనూసూద్ అభినందించారు. ఈ నేపథ్యంలో ప్రజలు వివిధ రూపాల్లో అందజేసిన డబ్బులతో ట్యాంక్‌బండ్ శివ ఓ అంబులెన్స్‌ను కొనుగోలు చేశారు. కాగా ఈ అంబులెన్స్‌కు సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్ అని పేరు పెట్టగా.. అంబులెన్స్ ప్రారంభోత్సవానికి రియల్‌హీరో సోనుసూద్‌ను శవాల శివ ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే శివ కోరిక మేరకు సోనూ ట్యాంక్‌బండ్‌కు వెళ్లి.. అక్కడున్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోవడంలో శివ చేస్తున్న కృషిని ప్రశంసించారు సోనూసూద్. అనేకమంది శివ లాంటి యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజానికి అంకిత భావంతో సేవలందిస్తున్న శివను ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.